CBN: సర్ణాంధ్ర విజన్ ను ప్రధానికి వివరించా

CBN: సర్ణాంధ్ర విజన్ ను ప్రధానికి వివరించా
X
అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులు వచ్చేలా చూడాలని కోరామన్న సీఎం... త్వరలోనే పోలవరం డయాఫ్రం వాల్ పనులు

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి, గడిచిన ఐదేళ్లలో జరిగిన విధ్వంసం గురించి ప్రధాని మోదీకి వివరించినట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు తన పర్యటనను ముగించారు. గత ఐదేళ్లలో కేంద్ర ప్రథకాలకు మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వలేదని ప్రధానికి వివరించానని చంద్రబాబు వెల్లడించారు. స్వర్ణాంధ్ర విజన్‌ డాక్యుమెంట్‌ గురించి ప్రధానికి వివరించానని... పోలవరం డయాఫ్రం వాల్‌ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని తెలిపారు. అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులు వచ్చేలా చూడాలని కోరామని చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు తొలి దశ కింద రూ.12,500 కోట్లను క్లియర్ చేసినందుకు, కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి ఆమోదం తెలిపినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేశాను అని వెల్లడించారు. అమరావతికి తొలి దశ కింద రూ.15 వేల కోట్లు ఇచ్చేందుకు ప్రపంచబ్యాంకు ముందుకొచ్చిందని, వచ్చే డిసెంబరు నుంచి అన్ని పనులు ప్రారంభమవుతాయని అన్నారు.

డిసెంబర్ నాటికి విశాఖ రైల్వే జోన్‌కు శంకుస్థాపన

డిసెంబరు నాటికి విశాఖ కొత్త రైల్వే జోన్‌కు శంకుస్థాపన చేసే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సమావేశమైన సీఎం.. ఏపీలో లాజిస్టికల్, కమ్యూటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బలోపేతం చేయాలని కోరారు. ఏపీ అంతటా వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో రైల్వే శాఖ రూ.73,743 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్.. చంద్రబాబుకు చెప్పారు. పలు అంశాలపై ప్రధాని మోదీకి స్పష్టత ఇచ్చానని చంద్రబాబు పేర్కొన్నారు. చాలావరకు ప్రధాని సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఇదే సహకారం భవిష్యత్తులోనూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారని, వారికి ధన్యవాదాలు తెలియజేశానని వివరించారు.

బుల్లెట్‌ రైలు నడిచేలా...

సౌత్‌ఇండియాలో నాలుగు ముఖ్యమైన నగరాలైన హైదరాబాద్‌, అమరావతి, చెన్నై, బెంగళూరు అనుసంధానం చేసేలా బుల్లెట్‌ రైలు నడిచేలా చర్యలు తీసుకోవాలని కోరామని చంద్రబాబు వెల్లడించారు. ఈ నాలుగు ఎకానమిక్‌ హబ్‌లను కవర్‌ చేస్తూ బుల్లెట్‌ రైలు పెడితే ఆర్థికపరమైన కార్యలాపాలు మరింతగా పెరుగుతాయని చెప్పామన్నారు. నడికుడి- శ్రీకాళహస్తి, కోటిపల్లి-నరసాపురం మధ్య రైల్వే లైన్లు ఇవ్వాలని కోరాం. కొన్ని రైల్వే లైన్లకు మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వాలని కోరామన్నారు.

రాజస్థాన్ సీఎంకి చంద్రబాబు ఫోన్

రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ చేశారు. విజయవాడ నుంచి వెళ్లిన న్యాయవాదుల బృందం ప్రయాణిస్తున్న బస్సు రాజస్థాన్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటన గురించి భజన్ లాల్‌తో చంద్రబాబు మాట్లాడారు. ప్రమాద బాధితులకు అవసరమైన సాయం అందించాలని కోరారు. వారంతా తిరిగి ఇంటికి రావడానికి సహాయ సహకారాలు అందించాలన్నారు.

Tags

Next Story