CBN: తప్పు చేస్తే తాట తీస్తాం

తానెప్పుడూ కక్షపూరిత రాజకీయాలు చేయలేదని... ఇప్పుడు కూడా చేయబోనని ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభ సాక్షిగా వెల్లడించారు. దీనిని అలుసుగా తీసుకుని శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తే మాత్రం ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ప్రజాస్వామ్యంలో పార్టీ కార్యాలయాలపై ఎప్పుడూ దాడి జరగలేదని, కానీ గత ప్రభుత్వ హయాంలో కర్రలు, ఆయుధాలతో దాడి చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. అటవీ భూముల్ని కూడా అక్రమించేసిన పరిస్థితి గత ప్రభుత్వలో ఏర్పడిందని సీఎం తెలిపారు. కానీ ఇప్పుడు భూ కబ్జాలు జరగకుండా కట్టుదిట్టమైన చట్టాన్ని తీసుకువచ్చామని వివరించారు. నేరస్థులకు తమ ప్రభుత్వం సింహస్వప్నంలా మారి వారిపై ఉక్కుపాదం మోపుతుందన్నారు. రౌడీలు, ఫ్యాక్షనిస్టులు, ముఠా తగాదాల మాటే వినబడకూడదని శాసనసభ వేదికగా హెచ్చరిస్తున్నానని చంద్రబాబు అన్నారు.
గత ప్రభుత్వం విఫలం..
ఏపీలో శాంతిభద్రతల పరిరక్షణలో గత ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. ప్రజలు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితులు తలెత్తాయని, ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ప్రజలు భయం లేకుండా సంతోషంగా జీవించాలంటే శాంతిభద్రతలను కాపాడటం చాలా ముఖ్యమని తెలిపారు. శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని సీఎం అన్నారు. ఈ విషయంలో డ్రోన్ల ద్వారా పెట్రోలింగ్ చేయిస్తున్నామని, నిందితులకు రెండు మూడు నెలల్లోనే శిక్షలు పడేలా కార్యాచరణ చేశామన్నారు. మహిళలపై అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం చేస్తే వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. సైబర్ సెక్యూరిటీ విషయంలో కట్టుదిట్టమైన చర్యలను ప్రభుత్వం చేపట్టిందని సీఎం స్పష్టం చేశారు. 26 జిల్లాల్లో సైబర్ పోలీసుస్టేషన్లు ఏర్పాటు చేసి భద్రత కల్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. తప్పు చేసినవారి తీట తీస్తామని సీఎం హెచ్చరించారు. ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరిరోజు అవుతుందని స్పష్టం చేశారు.
రాజకీయాల ముసుగులో..
రాజకీయాల ముసుగులో నేరాలు, ఘోరాలకు పాల్పడతామంటే ఈ ప్రభుత్వంలో సాగదని చంద్రబాబు తేల్చి చెప్పారు. శాంతిభద్రతలను పరిరక్షించే పోలీసులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఉదాశీనంగా వ్యవహరిస్తే పోలీసుల పట్ల కూడా కఠినంగా వ్యవహరిస్తామన్న చంద్రబాబు... డ్రగ్స్, గంజాయి వినియోగం విపరీతంగా పెరిగింది. బాధ్యత గల ప్రతిపక్షంగా ఆందోళన చేస్తే.. తిరిగి టీడీపీ కార్యాలయంపై దాడి చేశారన్నారు. ఇంత దుర్మార్గాన్ని తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదన్న చంద్రబాబు... శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపైనా ఉందన్నారు. రాజకీయాల ముసుగులో నేరాలు, ఘోరాలకు పాల్పడతామంటే ఈ ప్రభుత్వంలో సాగదన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com