CBN: వైసీపీ పాలనలో తవ్వేకొద్ది తప్పులు, అప్పులు

CBN: వైసీపీ పాలనలో తవ్వేకొద్ది తప్పులు, అప్పులు
X
మండిపడ్డ చంద్రబాబు... సువర్ణ అవకాశాలను జగన్‌ నిర్వీర్యం చేశారని మండిపాటు

వైసీపీ పాలనలో తవ్వేకొద్దీ తప్పులు, అప్పులు బహిర్గతం అవుతున్నాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం పూర్తయితే ప్రతి ఎకరాకు నీరు వచ్చి సంపద సృష్టించేవాళ్లమని... అమరావతి పూర్తయితే ఒక్కో కుటుంబం ప్రతి రోజూ కనీసం రూ.1000 సంపాదించుకునే అవకాశం వచ్చేదని అన్నారు. అలాంటి అవకాశాన్ని గత ఐదేళ్లలో పూర్తిగా జగన్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. ఒక వ్యక్తి సీఎంగా పనికిరాడని ఐదేళ్లు నిరూపించిన ఏకైన వ్యక్తి జగన్‌ అని విమర్శించారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లు వద్దని ఎన్నికల సంఘం ఆదేశిస్తే గత ప్రభుత్వ పెద్దలు పింఛను కోసం వృద్ధులను పంచాయతీ కార్యాలయానికి తిప్పి 33 మంది మరణానికి కారకులయ్యారని చంద్రబాబు గుర్తు చేశారు.

ఎన్టీఆర్‌ తొలిసారిగా పింఛను పంపిణీ ప్రారంభించారని... అప్పట్లో నెలకు రూ.35 ఇచ్చేవారని తాము దాన్ని 1994-95లో రూ.75కు పెంచామని చంద్రబాబు గుర్తు చేశారు. 2014లో రూ.200 ఉన్న పింఛను రూ.1000కి, తర్వాత రూ.2 వేలకు పెంచిన ఘనత తెలుగుదేశానిదే అని ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పుడు రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పింఛన్‌ పెంచామని... ప్రస్తుతం ఇస్తున్న పింఛనులో రూ.2840 తానె పెంచానని చెప్పడానికి గర్వపడుతున్నానని చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పెనుమాక ఎస్టీకాలనీలో సోమవారం ఉదయం ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులకు చంద్రబాబు పింఛను సొమ్ము అందించారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి ఒక్క కుటుంబం గురించి ఆలోచించి అందరికీ న్యాయం చేయడాన్ని బాధ్యతగా తీసుకుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తాను అందరివాడినే తప్ప ఏ ఒక్కరివాణ్నీ కాదని స్పష్టం చేశారు. శాశ్వతంగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించడానికి పనిచేస్తానని ప్రకటించారు. ఇందుకోసం భగవంతుడు ఇచ్చిన శక్తినంతా ఉపయోగించి, ఊపిరి ఉన్నంత వరకు పోరాడతానని మాట ఇచ్చారు.

ముఖ్యమంత్రి వస్తున్నారంటే రెండు రోజుల ముందు నుంచి హడావుడి.. దారి పొడవునా పరదాలు.. కిలోమీటర్ల మేర బారికేడ్లు.. చెట్ల నరికివేత.. దుకాణాల మూసివేత ఇకపై ఉండవని చంద్రబాబు తెలిపారు. సీఎం చంద్రబాబు పర్యటన అత్యంత సాదాసీదాగా కొనసాగింది. ఉదయాన్నే ముఖ్యమంత్రి వీధుల్లో నడుచుకుంటూ అందరినీ పలకరిస్తూ పింఛను లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లారు. స్థానిక మహిళలు ఆయనకు హారతులిచ్చి, స్వాగతం పలికారు. ఎక్కడా పోలీసుల అనవసర హడావుడి లేదు. ముఖ్యమంత్రి స్థాయి ప్రముఖుల సభలకు ఉండే డి-సర్కిల్‌ను సైతం ఎత్తివేసి, పెనుమాకలో సాదాసీదాగా వేదిక ఏర్పాటు చేశారు. వేదికపై ప్రత్యేక కుర్చీలు లేకుండా స్థానికులతో కలిసి చంద్రబాబు కూర్చున్నారు. ప్రసంగం తర్వాత ప్రజలు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్పారు.

Tags

Next Story