CBN: ప్రజలకు అన్యాయం చేసేందుకు జగన్‌ కుట్ర

CBN: ప్రజలకు అన్యాయం చేసేందుకు జగన్‌ కుట్ర
ఆ అయిదు బోట్లు వైసీపీ నేతలవే... ప్రకాశం బ్యారేజీకి నష్టం కలిగించేందుకే వదిలారన్న సీఎం

వైసీపీపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు అన్యాయం చేయడానికి జగన్‌ చేయని కుట్ర లేదంటూ మండిపడ్డారు. ప్రకాశం బ్యారేజీకి నష్టం కలిగించడమే వారి ఉద్దేశమని.. అందుకే వైసీపీ నేతలే కుట్రపూరితంగా కృష్ణా నదిలోకి ఐదు బోట్లు వదిలారని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ రంగులున్న ఆ పడవలను కావాలనే లంగర్లు వేయకుండా వదిలేశారని మండిపడ్డారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. జగన్‌ బెంగళూరులో ఉండి ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని అన్నారు. 11 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహంలో 30 మెట్రిక్‌ టన్నుల బరువున్న మూడు పడవలు ఢీకొట్టడంతో బ్యారేజీ సపోర్టింగ్‌ కౌంటర్‌ వెయిట్‌ విరిగిపోయే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇసుక అక్రమ వ్యాపారం చేసిన పడవల్నే ప్రాజెక్టుకు నష్టం కలిగించేందుకు వాడారని విమర్శించారు. వైసీపీ పాలకులు బుడమేరును పట్టించుకోకపోవడం వల్లనే నష్టం పెరిగి ఈ దుస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్‌వి నీచ రాజకీయాలు

జగన్‌ ఎక్కడో బెంగళూరులో ఉండి ఇక్కడి ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ముంపు బాధితుల్ని ఆదుకోకపోగా నీచరాజకీయాలు చేస్తున్నారు. వాళ్లే నేరాలు, ఘోరాలు చేసి ఇతరుల పైకి నెడుతున్నారన్నారు. సాక్షి పత్రికలో విషం కక్కుతున్నారని... సామాజిక మాధ్యమాల్లో ఫేక్‌ పోస్టులు పెడుతున్నారని అన్నారు. మోసం చేయాలని కుట్రలు పన్నుతున్నారన్న చంద్రబాబు.. తాము ప్రజలందరికీ న్యాయం చేయాలని చూస్తుంటే, వారికి అన్యాయం చేయడానికి జగన్‌ అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో బుడమేరుకు పడ్డ గండ్లను వైసీపీ ప్రభుత్వం పూడ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఇందుకు సిగ్గుపడాల్సిన పార్టీ ఎదురుదాడి చేస్తోందన్నారు. స్థానికంగా కొందరు కాలువలను, డ్రైయిన్లను కబ్జాచేశారని... బుడమేరును పూర్తిగా ఆక్రమించారని.... అక్రమకట్టడాలు నిర్మించారని.... రిజిస్ట్రేషన్లు చేసి అమ్ముకున్నారని చంద్రబాబు అన్నారు. దీంతో వరద నీరు పోయే పరిస్థితి లేదన్నారు. వరదల రూపంలో ప్రజలకు ఊహించని కష్టం వచ్చిందదన్నారు.

Tags

Next Story