CBN: గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

CBN: గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
పల్లెల సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న చంద్రబాబు... వైసీపీపై తీవ్ర ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామాల అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. పల్లెల సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. వైసీపీ పాలనలో పంచాయతీలకు వచ్చిన ఆర్థిక సంఘం నిధులను ఇతర అవసరాలకు మళ్లించి సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా గడవకముందే రూ.998 కోట్ల నిధులను గ్రామ పంచాయతీ ఖాతాల్లో వేశామని, త్వరలో మరో రూ.1,100 కోట్లు జమ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో సర్పంచి పల్లి భీమారావు అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. వానపల్లిలో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు.. ఇలా 16 పనులకు రూ.10.20 కోట్లతో ఆమోదం తెలుపుతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.

గ్రామాల అభివృద్ధి గురించి ప్రజలంతా చర్చించాలనే ఉద్దేశంతోనే రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామాల్లో ఒకే రోజు పండగలా సభలు నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌తో కలిసి నిర్ణయించామని చంద్రబాబు వెల్లడించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.4,500 కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు. ఈ ఏడాది 9 కోట్ల పని దినాలతో 54 లక్షల కుటుంబాలకు 100 రోజుల పని కల్పిస్తామని... రాబోయే ఐద్లేలో రాష్ట్రమంతటా 17,500 కి.మీ.సీసీ రోడ్లు, 10 వేల కి.మీ. డ్రెయిన్లు నిర్మిస్తామని చంద్రబాబు తెలిపారు. నరేగా ద్వారా 2014-19లో తాము 27,444 కి.మీ మేర సీసీ రోడ్లు నిర్మిస్తే వైకాపా వచ్చాక ఐదేళ్లలో 6,643 కి.మీ మాత్రమే వేశారని చంద్రబాబు విమర్శించారు. మరుగుదొడ్లు, చెత్త నుంచి సంపద కేంద్రాలు 9,830 నిర్మిస్తే.. జగన్‌ వాటికి వైసీపీ రంగులు వేశారే తప్ప వినియోగించలేదని ఎద్దేవా చేశారు.

వైసీపీ నాయకులు నరేగాలో దొంగ బిల్లులు పెట్టి, పనులు చేయకుండానే ఇష్టారాజ్యంగా దోచుకొన్నారని ఆరోపించారు. ఐదు కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో 3.54 కోట్ల మంది గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారని.. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి సాధ్యమని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఉచిత గ్యాస్‌ సిలెండర్ల హామీని త్వరలోనే అమలు చేస్తామని వెల్లడించారు. సాంకేతికతను సమర్థంగా వినియోగించుకుంటే ప్రగతి పరుగులు పెడుతుందని, ప్రజలు సైతం అందిపుచ్చుకోవాలని చంద్రబాబు సూచించారు. పొలంలో పంటకు తెగులు పట్టిందో లేదో సెల్‌ఫోన్‌లో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని ఫొటో పెడితే చెప్పేస్తుందన్నారు. డ్రోన్ల సాయంతో ఎక్కడ అవసరమో ఆ ప్రాంతంలోనే పురుగుమందు పిచికారీ చేయొచ్చని తెలిపారు. పోలవరం ప్రాజెక్టులో రూ.900 కోట్లతో కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మిస్తామని, లేకుంటే ఏదైనా ప్రమాదం జరిగితే గోదావరి జిల్లాలు కొట్టుకుపోయే స్థితి వస్తుందని చెప్పారు.

Tags

Next Story