CBN: గిరిజన ప్రాంతాల్లో సమస్యలు ఉండకూడదు

CBN: గిరిజన ప్రాంతాల్లో సమస్యలు ఉండకూడదు
ఇంకా డోలీ మోతలు కనపడకూడదు... అధికారులకు చంద్రబాబు ఆదేశం

ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన సంక్షేమశాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలీ మోతలు కనిపించకూడదని అధికారులను ఆదేశించారు. గిరిజన మహిళల సౌకర్యం కోసం గర్భిణి వసతి గృహాలు, ట్రైకార్‌, జీసీసీ, ఐటీడీఏలను యాక్టివేట్‌ చేయాలని సూచించారు. గత ప్రభుత్వ వ్యవస్థల విధ్వంసంతో గిరిజనుల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయని చంద్రబాబు మండిపడ్డారు. అవసరమైన మౌలిక వసతులు కల్పించడం ద్వారా ఫీడర్ అంబులెన్స్ లను తిరిగి ప్రవేశ పెట్టాలని ఆదేశించారు. 2014 నుంచి 2019 మధ్య అమల్లో ఉన్న పథకాలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. గిరిజన విద్యార్థుల కోసం తెచ్చిన ఎన్టీఆర్ విద్యోన్నతి, అంబేడ్కర్‌ ఓవర్ సీస్ విద్యానిధి, బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ పథకాలను నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

సాంఘీక సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆర్థికంగా అత్యంత వెనుకబాటులో ఉండే దళిత వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించే కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిథి, సివిల్ సర్వీస్ శిక్షణ కోసం ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం, బెస్ట్ అవెయిలబుల్ స్కూల్స్, చంద్రన్న పెళ్లి కానుక లాంటి పథకాల ద్వారా వేల కుటుంబాలకు లబ్ది చేకూరిందని.. అయితే తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ పథకాలను నీరు గార్చిందని సీఎం చంద్రబాబు అన్నారు.

బడుగు, బలహీన వర్గాలను ఆర్థికంగా నిలబెట్టేందుకు ఉపయోగపడే, వారిని పేదరికం నుంచి బయటపడేసే పథకాలను రద్దు చేయడం వల్ల ఆ వర్గానికి తీరిని నష్టం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సోషల్ వెల్ఫేర్ శాఖకు కేటాయించిన నిధుల్లో 83 శాతం ఖర్చు చేస్తే.. వైసీపీ ప్రభుత్వంలో కేవలం 67 శాతం మాత్రమే నిధులు ఖర్చు చేశారని అధికారులు వివరించారు. రోజూ వారీ కష్టంపై బతికే, అత్యంత పేదరికంతో ఉండే ఈ వర్గానికి మళ్లీ ఊతంగా నిలవాల్సిన అవసరం ఉందని.. వారిని పేదరికం నుంచి బయట పడేసేందుకు అవసరమైన కార్యక్రమాలు రూపొందించాలని సీఎం సూచించారు. విద్య, ఉపాధి అవకాశాల ద్వారా వారి జీవితాల్లో మార్పులు తేవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags

Next Story