AP: అచ్యుతాపురం ప్రమాద ఘటనవై ఉన్నతస్థాయి విచారణ

AP: అచ్యుతాపురం ప్రమాద ఘటనవై ఉన్నతస్థాయి విచారణ
రెడ్ జోన్ పరిశ్రమల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం

అచ్యుతాపురం సెజ్‌ ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.కోటి, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50లక్షలు, గాయపడిన వారికి రూ.25లక్షలు ఆర్థిక సాయం ప్రకటించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. పరిశ్రమల్లో భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. కానీ, ఇక్కడ నిబంధనల మేరకు ఎస్‌వోపీ అనుసరించలేదని తెలుస్తోందన్నారు. పరిశ్రమల్లో పూర్తిస్థాయి భద్రతా ప్రమాణాలు చేపట్టలేదని.... గత ఐదేళ్లలో విశాఖలో 119 ఘటనల్లో 120 మంది మృతి చెందారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమల్లో వెంటనే అంతర్గత విచారణ చేపట్టాలి. రెడ్‌ కేటగిరిలోని పరిశ్రమలన్నీ కచ్చితంగా ఎస్‌వోపీని పాటించాలన్నారు.


ఎసెన్షియా ఫార్మా కంపెనీ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ కమిటీ వేస్తున్నామన్న చంద్రబాబు... పరిశ్రమలో ఏం జరిగింది.. లోపాలపై కమిటీ విచారిస్తుందని తెలిపారు. నివేదిక వచ్చాక ఎవరు తప్పుచేసినా వదిలిపెట్టబోమని.. శిక్షిస్తామన్నారు. బాధిత కుటుంబాలు, క్షతగాత్రులకు పరిహారం కంపెనీ నుంచే ఇప్పిస్తున్నామన్న చంద్రబాబు.. ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్‌ కోసం కూడా ఓ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు.

రెడ్ జోన్ పరిశ్రమల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలి అని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.. ప్రమాదాలను వీలైనంత వరకు తగ్గించడం కోసం ప్రయత్నం చేయాలన్నారు. గుడ్డ కాల్చి ముఖం మీద వేసి తుడుచుకో మనే పరిస్థితి ఇటీవల రాష్ట్రంలో ఉందన్నారు.. వారసత్వంగా వచ్చిన లేగసి సమస్యనా.. లేక పరిశ్రమలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి అనే అనుమానం ఉంది.. నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవడంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారిస్తాం అన్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యాలు సేఫ్టీ విషయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకోవాలి.. గత ఐదేళ్లు పరిశ్రమలను లూట్ చేశారు.. ఆ కారణం గానే ప్రమాదాలు ఎక్కువయ్యాయి.. వారసత్వంగా వచ్చిన లేగసీ కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నట్టు కనిపిస్తోందన్నారు.

Tags

Next Story