CBN: అధికారులూ... నిర్లక్ష్యం వద్దు
వైసీపీ ఐదేళ్ల పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అధికారులు పని చేయడం కూడా మానేశారని మండిపడ్డారు. వరద ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. బాధితులకు మూడు పూటలా ఆహారం అందించేలా చూడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అధికారులు ఎవరైనా పనిచేయకపోతే ఉపేక్షించేది లేదని మరోసారి స్పష్టం చేశారు. జక్కంపూడి కాలనీలో పనిచేయని అధికారిని సస్పెండ్ చేసి వివరణ కోరామన్నారు. మంత్రులైనా సరే సరిగా పనిచేయకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. ఆకస్మిక తనిఖీలు చేస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు.
ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారి హితం కోసం పనిచేయాలని మీడియాకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ముంపు బాధితుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయని, వారికి ఆహారం అందలేదనే సమాచారం వస్తోందని... అన్నారు, మృతదేహాన్ని రోడ్డుపై వదిలేసి వెళ్లిపోతే బాధిత కుటుంబ ఆవేదన ఎలా ఉంటుందో ఆలోచించాలని అధికారులకు సూచించారు. ఇళ్లలోకి పాములు, తేళ్లు వచ్చే పరిస్థితి ఉందని చంద్రబాబు చెప్పారు. అధికారులు మానవతా దృక్పథంతో పనిచేయాలని చంద్రబాబు సూచించారు. ప్రజలను ఇబ్బందులు పెడితే తక్షణమే అధికారుల్ని ఇంటికి పంపిస్తామన్నారు. ఆహారం, ఇతర సౌకర్యాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం. సహాయ చర్యల అమలుపై ప్రజలకు నాపై ఎంతో నమ్మకం ఉంది. వారు నన్ను తప్పుపట్టడం లేదు. క్షేత్రస్థాయిలో కొందరు అధికారుల తీరు చూసి వారు ఆవేదన చెందుతున్నారు. మేం కోరుకుని మిమ్మల్ని తెచ్చుకున్నాం.. మీ హయాంలోనూ ఇలా జరగడమేంటి అంటున్నారు’ అని వివరించారు.
మరోసారి భారీ వరద
విజయవాడ గన్నవరం నియోజకవర్గంలోకి ప్రవహించే ఏలూరు, బుడమేరు పంట కాలువలకు మూడు రోజులుగా వరద ఉప్పొంగి ఎక్కడికక్కడ గట్లు తెగిపడ్డాయి. ప్రధానంగా నిడమానూరు- గూడవల్లి- జక్కులనెక్కలం మార్గంలో రెండు కాలువలకు ఆరుచోట్ల గండి పడింది. జక్కులనెక్కలం నుంచి కేసరపల్లి మధ్య నాలుగు ప్రాంతాల్లో బుద్ధవరం పరిధిలో ఒకచోట కాలువ గట్లు తెగి, వరద పరిసరాల్లోని పొలాలు, ఆయా గ్రామాలపై పడింది. తొలుత బుడమేరుకు నాలుగు ప్రాంతాల్లో గండి పడటంతో జక్కులనెక్కలం, సావరగూడెం పొలాల్లోకి మనిషిలోతు నీరు చేరి, గ్రామాలను చుట్టుముట్టింది. మరోవైపు చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న నిడమానూరు, గూడవల్లి పరిసరాల్లోని పరిశ్రమల్లోకి వరద చేరింది. జాతీయ రహదారిపైనా వరదనీరు ప్రవహిస్తుండటంతో వాహనచోదకులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వరద కంకిపాడు మండలం వేల్పూరు వైపునకు దూసుకెళ్లడం, ఏలూరు కాలువకు కేసరపల్లి పరిసరాల్లో ఐదుచోట్ల గండి పడటంతో కేసరపల్లి-ఉప్పులూరు మార్గంలోని పొలాలతో పాటు ఎస్‌ఎల్‌వీ గృహ సముదాయం కూడా పూర్తిగా నీట మునిగింది. రాత్రికి వరద తగ్గుముఖం పట్టడంతో నివాసితులు ఊపిరిపీల్చుకుంటున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com