CBN: గుండె చెదిరిపోయే నిజాలు బయటకు వస్తున్నాయి

జగన్ లాంటి వ్యక్తులు అసలు రాజకీయాలకు అవసరమా? అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో రుషికొండపై నిర్మించిన భవనాలను మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి సీఎం చంద్రబాబు పరిశీలించారు. రుషికొండ భవనాలను పరిశీలించిన చంద్రబాబు.. జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. రాజులు కూడా ఇలాంటి భవనాలను కట్టుకోలేదని మండిపడ్డారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విలాసవంతమైన భవనాలు ఎందుకు ఉపయోగపడతాయో తనకే అర్థం కావడం లేదని చంద్రబాబు అన్నారు. రాజకీయ నేత ఇలాంటి తప్పులు చేస్తారని తాను ఊహించనే లేదన్నారు. ఒక ముఖ్యమంత్రి విలాసం కోసం పర్యావరణాన్ని విధ్వంసం చేసి ప్యాలెస్ కట్టుకోవడం ఎక్కడా చూడలేదని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.రౌడీ రాజకీయాలు వద్దు.. అభివృద్ధి రాజకీయాలు కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘రహదారులు బాగుంటే వ్యాపారాలు బాగా జరుగుతాయి. సంక్రాంతి లోపు రోడ్లపై ఉన్న గుంతలన్నీ పూడ్చాలి. గత సీఎం రహదారులపై ఈత కొలనులు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని రోడ్లు నరకానికి మార్గాలుగా మారాయి. ఈ దుస్థితికి గత పాలకుడే కారణం’ అని తెలిపారు.
కలలో కూడా ఊహించనిది
ఎవరూ కలలో కూడా ఊహించనిది జరిగిందని చంద్రబాబు అన్నారు. ఒక వ్యక్తి విలాసవంతమైన జీవితం కోసం ఏవిధంగా కార్యక్రమాలు చేస్తాడనేది ఇక్కడి భవనాలు చూశాకే తెలిసిందన్నారు. గుండె చెదిరిపోయే నిజాలు బయటకు వస్తున్నాయని చంద్రబాబు అన్నారు. గతంలో.. మీడియా, ఇతరులు ఎంత ప్రయత్నించినా రుషికొండపై ఏం చేస్తున్నారో తెలియకుండా చేశారని... ఎన్జీటీ, హైకోర్టు, కేంద్ర ప్రభుత్వాన్ని మభ్యపెట్టారని అన్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా చేయగలరో అనే దానికి ఇక్కడి పరిస్థితి ఒక ఉదాహరణ అని ఆవేదన వ్యక్తం చేశారు. తాను, మిత్రుడు పవన్ కల్యాణ్ కూడా ఇక్కడకు రావాలని ప్రయత్నించామని.. కానీ ఎవరినీ రానీయకుండా చేశారన్నారు. ఇక్కడ ఏం జరిగిందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని.... ఆ అధికారం ప్రజలే తమకు ఇచ్చారని అన్నారు. పూర్వం రాజులు, చక్రవర్తులు కూడా ఇలాంటి భవనాలు నిర్మించుకోలేదన్నారు.
యువ నేతలంతా జాగ్రత్తగా ఉండాలి: చంద్రబాబు
గెలిచిన యువనేతలందరూ ఎంతో జాగ్రత్తగా ఉండాలని, పార్టీ కార్యకర్తలను గౌరవించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు సూచించారు. చరిత్రలోనే రికార్డు స్థాయి విజయం సాధించామని, దీని వెనుక కార్యకర్తల త్యాగాలు ఉన్నాయన్నారు. ఎప్పుడూ రానంత విజయం వచ్చిందంటే, ప్రజలు ఎంత ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారో అర్థం చేసుకోవాలని సూచించారు. అలాగే మీకోసం మనస్సాక్షిగా పనిచేస్తానని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com