AP:టీడీపీ ఓ ప్రభంజనం

పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో సంక్షోభాలు ఎదురైనా తెలుగుదేశం ఎన్నడూ వెన్నుచూపలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 43 ఏళ్లుగా సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకుంటూ ముందుకు సాగుతోందని చెప్పారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొన్న చంద్రబాబు పసుపు జెండాను ఆవిష్కరించారు. ‘మన జెండాకు ఒక అర్థం ఉంది. అన్నదాతలకు అండగా ఉండాలని నాగలి, కార్మికులకు, పారిశ్రామిక ప్రగతికి చిహ్నంగా చక్రం, నిరుపేదలకు నీడను అందించాలని గుడిసె చిహ్నాలు చూచిస్తున్నాయి. ఇదే మన నాయకుడు నందమూరి తారక రామారావు విజన్’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్టీనే ప్రాణంగా బతికే పసుపు సైన్యానికి పాదాభివందనం చేస్తున్నట్లు తెలిపారు. పేదల సంక్షేమానికి నాంది పలికిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడిన చంద్రబాబు తెలుగువారు ఉన్నంతవరకు పార్టీ ఉంటుందని ఉద్ఘాటించారు.
డీఎస్సీపై కీలక వ్యాఖ్యలు
ఏప్రిల్ నెలలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని సీఎం చంద్రబాబు టీడీపీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో ప్రకటించారు. మే నెలలో తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా.. వాటిని అధిగమిస్తూ ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్‌ను కూడా 2027 కల్లా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ఎన్టీఆర్ లాంటి వ్యక్తి మళ్లీ పుట్టరు
ఎన్టీఆర్ లాంటి వ్యక్తి మళ్లీ పుట్టరని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. 'టీడీపీ ఒక సంచలనం. టీడీపీకి నేను టీమ్ లీడర్‌ని మాత్రమే. మనం వారసులం మాత్రమే కానీ.. పెత్తందార్లము కాదు. టీడీపీని లేకుండా చేస్తామని చాలా మంది చెప్పారు కానీ వాళ్లే కాలగర్భంలో కలిసిపోయారు. గుప్తుల కాలం స్వర్ణయుగం అంటారు.. అలాగే టీడీపీది స్వర్ణయుగం.'అని చంద్రబాబు పేర్కొన్నారు.
టీడీపీకి కార్యకర్తలే బలం
టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు 'ఎక్స్' వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. '43 ఏళ్లుగా తెలుగు ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్న పార్టీ మన తెలుగుదేశం పార్టీ. నందమూరి తారకరామారావు ఆశీస్సులతో సంచలనంగా ఆవిర్భవించిన టీడీపీ దేదీప్యమానంగా వెలుగుతుందంటే దానికి కారణం కార్యకర్తల తిరుగులేని పోరాటం. పార్టీ సాధించిన ప్రతి విజయం వెనుక కార్యకర్తల కష్టం ఉంది.' అంటూ పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com