CBN: తప్పు చేస్తే అదే ఉద్యోగానికి ఆఖరి రోజు

తిరుమల మాదిరిగా శ్రీశైలాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. శ్రీశైలం పర్యాటకానికి అనుకూలమైన ప్రాంతమని సీఎం అన్నారు. శ్రీశైలం మాస్టర్ ప్లాన్ రూపకల్పన కోసం మంత్రులు పవన్ కళ్యాణ్, కందుల దుర్గేశ్, ఆనం, బీసీ జనార్ధన్‌తో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సీ ప్లేన్ ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చిందని, విజయవాడ నుంచి శ్రీశైలానికి 40 నిమిషాల్లో వచ్చామని ప్రెస్‌మీట్‌లో చెప్పారు. విజయవాడ-శ్రీశైలం మధ్య సీ ప్లేన్‌లు ప్రారంభమయ్యాయి. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ పున్నమి ఘాట్‌లో సీ ప్లేన్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. శ్రీశైలం జలాశయం వరకు ప్రయాణించనున్నారు. శ్రీశైలంలో మల్లికార్జున స్వామివాని దర్శించుకున్నారు.
శ్రీశైలం అభివృద్ధికి కమిటీ
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. తిరుమల తరహాలోనే శ్రీశైలం ఆలయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ఆలయం సహా పరిసర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కమిటీని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. నల్లమల అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని.. వీటన్నింటి కోసం మంత్రులు ఆనం రామనారాయణ, కందుల దుర్గేశ్, జనార్దన్‌లతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
సోషల్ లో అతిని సహించేదే లేదు
ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేసేందుకు ఓవైపు తాము అహర్నిశలూ కృషి చేస్తుంటే.. కొంతమంది సోషల్ మీడియాలో ఇష్టానుసారం చెలరేగిపోతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. అనుచితంగా పెట్టే పోస్టులను తీవ్రంగా పరిగణిస్తామన్నారు. ఆడబిడ్డల జోలికి వచ్చి వారి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టీడీపీ దేనికీ భయపడదన్నారు. తీవ్రవాదులతోనే పోరాడామని.. ముఠానాయకులను పూర్తిగా కట్టడి చేశామని.. మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిని నియంత్రించామని తెలిపారు. ప్రస్తుతం రౌడీలు రాజకీయ ముసుగులు వేసుకున్నారని.. వారి ముసుగులను తొలగిస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో రౌడీలను రౌడీలుగా, నేరస్థులను నేరస్థులుగానే చూస్తామని.. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తెలిపారు. ‘ఎవరైనా సరే చట్టానికి లోబడే పనిచేయాలి. ఒకరిద్దరు పోలీసులు లాలూచీ పడినా, తప్పు చేసినా అదే వారి ఉద్యోగానికి ఆఖరి రోజు అవుతుంది. శాంతిభద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయి.
పవన్ బిడ్డలను ఏడ్పించారు
సోషల్ మీడియా పోస్టుల వల్ల తన బిడ్డలు బోరున ఏడ్చారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు. ఇలాంటి వాటిని ప్రభుత్వం భరించాలా’ అని చంద్రబాబు ప్రశ్నించారు. గతంలో ఎన్నికల సమయంలో బాబాయిని చంపి గుండెపోటని అబద్ధమాడారని, తర్వాత గుండెపోటు కాదని, గొడ్డలి పోటని సాయంత్రానికి తెలిస్తే.. జగన్ పత్రిక ‘నారాసుర రక్తచరిత్ర’ అని వేసిందని దుయ్యబట్టారు. ‘అనాడే అబద్ధాలాడిన వారిని లోపల వేయిస్తే ఏమై ఉండేది? కానీ మంచితనంతో నేనా పని చేయలేదు. దీనిని దుర్వినియోగం చేయాలని చూస్తే ఖబడ్దార్. తప్పు చేసిన వారెవరినీ వదిలిపెట్టం’ అని సీఎం తేల్చిచెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com