CBN: కఠిన చట్టాలు తెస్తా.. తాట తీస్తా: చంద్రబాబు

సోషల్ మీడియాపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. హోంమంత్రి అనితపై కూడా దిగజారుడు కామెంట్స్ చేస్తున్నారని.. గతంలో పవన్, ఆయన పిల్లలపైనా అసభ్యకర కామెంట్స్ చేశారని అన్నారు. ఆడబిడ్డల జోలికొస్తే వదిలేదే లేదన్నారు. సోషల్ మీడియా కట్టడికి కఠిన చట్టాలు తెస్తానని.. అసభ్యకర పోస్టులు పెట్టిన వారి తాట తీస్తానని చంద్రబాబు తీవ్ర హెచ్చరికలు చేశారు. మహిళల గౌరవానికి భంగం కలిగితే సహించనన్నారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఇష్టారాజ్యంగా పోస్టులు పెడుతున్నారని, వీటిపై తన బిడ్డలు సైతం బాధపడుతున్నారంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేబినెట్ భేటీలో ప్రస్తావించారు. అలాగే వాటిపై చర్యలు తీసుకోని పోలీసులపైనా ఫైర్ అయ్యారు. దీనిపై స్పందించిన చంద్రబాబు.. సోషల్ మీడియాలో వాడే భాష చూస్తున్నామని, ఆడబిడ్డలపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
వాళ్లను వదిలిపెట్టాలా..
తనపై, హోంమంత్రి అనితపై, డిప్యూటీ సీఎం పవన్‌పై కూడా ఇష్టానుసారం మాట్లాడుతున్నారని చంద్రబాబు తెలిపారు. పవన్‌పైనే కాదు, ఆయన పిల్లలపైనా వ్యాఖ్యలు చేశారన్నారు.. ఇలాంటి వాళ్లను వదిలిపెట్టాలా.. చర్యలు తీసుకోవాల్సిందే. అని చంద్రబాబు స్పష్టం చేశారు. తానెప్పుడూ రాజకీయం చేయనని, తనను మోసం చేయాలనుకుంటే వదిలిపెట్టనని చంద్రబాబు తెలిపారు. హద్దు మీరి ప్రవర్తిస్తున్నారని, ఇక ఖబడ్దార్ అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. కొవ్వు ఎక్కువై నేరస్తులుగా తయారవుతున్నాయని, వారి కొవ్వు కరిగిస్తానని చంద్రబాబు తెలిపారు. సోషల్ మీడియాకు అడ్డూ అదుపులేకుండా పోయిందని.. ఆడబిడ్డలపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ వేదికగా తన భార్యపైన దిగజారుడు వ్యాఖ్యలు చేశారన్న సీఎం.. మదమెక్కి, కొవ్వు పట్టిన వైసీపీ నేతలను వదిలే ప్రసక్తే లేదన్నారు. తనతో ఆడుకోవాలని చూస్తే ఎవరినీ వదిలి పెట్టనని స్పష్టం చేశారు. నేరస్థులు రాజకీయ నేతల ముసుగులో ఉన్నారన్నారు.
వ్యక్తిత్వ హననమే స్వేచ్ఛ
రాష్ట్రంలో ఆడబిడ్డలకు ఇబ్బంది కలిగించేలా పోస్టులు పెడితే సహించేది లేదని, తమది చేతగానితనం అనుకోవద్దని చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. భావ వ్యక్తీకరణ అంటే వ్యక్తిత్వ హననం చేయడమా అని ప్రశ్నించారు. మీకు ఏ చట్టం ఏ హక్కు ఉందన్నారు. ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక చట్టం తెస్తామని తెలిపారు. వైసీపీకి వాత పెట్టడం ఖాయమని. రౌడీలు, గూండాలు ఏ ముసుగులో వున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చంద్రబాబు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆంబోతుల మాదిరిగా ఆడబిడ్డలపై ఇష్టానుసారం మాట్లాడితే ఏ ఒక్కరినీ విడిచిపెట్టబోమని ఆయన హెచ్చరించారు. ఒక్క సీటు కూడా గెలవడానికి వీల్లేని వ్యక్తులు వైసీపీ వాళ్లని, అసలు రాజకీయాల్లోనే ఉండకూడని వ్యక్తులని ముఖ్యమంత్రి ద్వజమెత్తారు. వైసీపీ నేతల ఇళ్లలో ఆడబిడ్డలు కూడా స్పందించాలనీ, ఆ పార్టీలో తమ కుటుంబ సభ్యులు ఉండడం సబబేనా అనేది ఆలోచించుకోవాలన్నారు. పోలీసులు కూడా ఆలోచించుకోవాలని సూచించారు. పోలీసులపై నేరస్థులు పైచేయి సాధిస్తే పరిణామాలు ఇలానే ఉంటాయన్నారు. నేరస్తులపై పోలీసులు పైచేయి సాధిస్తేనే వారు అదుపులో ఉంటారని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com