CBN: నేడే చంద్రబాబు పోలవరం పర్యటన

ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు పరిశీలించారు. ఐటీడీఏ పీవో సూర్యతేజ, జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఇతర శాఖ అధికారులు పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుని కింద స్థాయి సిబ్బందికి పలు సూచనలు చేశారు. సీఎం పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు వద్ద ఎలిప్యాడ్ ఏర్పాటు చేసి ట్రయల్ రన్ నిర్వహించారు. చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు..సోమవారాన్ని పోలవారంగా నిర్దేశించుకుని ప్రాజెక్టు పురోగతిని సమీక్షించేవారు. ఆ కృషి ఫలితంగానే పోలవరంలో కుడికాలువ పనులు పూర్తయ్యాయి. ప్రధాన డ్యామ్‌లో 65 శాతం పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుకు ఎదురైన సవాళ్లను అధిగమించి... పనులు పూర్తిచేయాలని చంద్రబాబు సంకల్పించారు.
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ఆదివారం రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి డా. నిమ్మల రామానాయుడు పోలవరంలో పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యమంత్రివర్యులు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణపనులలో ప్రతీ అంశంలో వాటి నిర్మాణ ప్రగతిని ఆయా ప్రాంతాలకు వెళ్లి పరిశీలిస్తారని, ఆయా ప్రాంతాలలో ఇంజనీరింగ్ సిబ్బంది పనుల ప్రగతిని ముఖ్యమంత్రికి తెలియజేస్తారన్నారు. అనంతరం అధికారులతో సమీక్షిస్తారన్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లలో అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యావేణి ని మంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ డి. మేరీ ప్రశాంతిని మంత్రి ఆదేశించారు.
పరిపాలనలో సంస్కరణలు
పరిపాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రక్షాళన ప్రారంభించారు. సీనియర్ ఐపీఎస్‌లు... రాజేంద్రనాధ్ రెడ్డి, పీఎస్సార్ ఆంజనేయులు, కొల్లి రఘురామిరెడ్డి, ఎన్.సంజయ్, సునీల్ కుమార్ వంటి వారిపై బదిలీ వేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. జగన్ ప్రభుత్వంలో.. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబు చేసిన 5సంతకాల అమలుపై ప్రణాళికతో, వేగంగా పని చేయాలని ఉన్నతాధికారులకు సీఎంవో నుంచి ఆదేశాలు వెళ్లాయి. నిర్ణయం వెలువడిన తరువాత ఎలాంటి జాప్యం ఉండకూడదని స్పష్టంచేసినట్లు సమాచారం. పాలనపై కొత్త ప్రభుత్వం మార్క్, మార్పు కనిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానంతో ప్రక్షాళన మొదలు పెట్టిన చంద్రబాబు....... ఈవోగా ధర్మారెడ్డిని తప్పించి శ్యామలరావుకు పోస్టింగ్ ఇచ్చారు. అన్ని విభాగాల్లో మార్పులు, చేర్పులకు ఆయన కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com