AP: లడ్డూ కల్తీపై సిట్ దర్యాప్తును స్వాగతించిన అన్ని పార్టీలు

AP: లడ్డూ కల్తీపై సిట్ దర్యాప్తును స్వాగతించిన అన్ని పార్టీలు
X
స్వాగతిస్తున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. సత్యమేవ జయతే అంటూ ట్వీట్

తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకానికి సంబంధించి స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పును సీఎం చంద్రబాబు స్వాగతించారు. తిరుమల లడ్డూ కల్తీ ఘటనపై సీబీఐ, ఏపీ పోలీస్, ఎఫ్ఎస్ఎస్ఏఐ సభ్యులతో సిట్ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని చంద్రబాబు అన్నారు. సత్యమేవ జయతే, ఓం నమో వెంకటేశాయ అని ముఖ్యమంత్రి ట్వీట్‌ చేశారు. మంత్రి నారా లోకేశ్ సైతం సుప్రీం తీర్పును స్వాగతించారు. పవిత్ర తిరుపతి లడ్డూ కల్తీకి పాల్పడిన వారిని గుర్తించేందుకు సిట్‌లో భాగమైన ఏజెన్సీల అదనపు మద్దతుతో కొనసాగుతోన్న దర్యాప్తును పటిష్టం చేయాలనే సుప్రీం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు లోకేశ్ ట్వీట్‌ చేశారు. హోంమంత్రి అనిత సైతం సుప్రీం నిర్ణయాన్ని స్వాగతించారు. శ్రీవారి లడ్డు అనేది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయమని హోంమంత్రి అన్నారు. సుప్రీంకోర్టు స్వతంత్ర దర్యాప్తు సంస్థతో సిట్ ఏర్పాటు చేయడం శుభ పరిణామమని అనిత తెలిపారు. ఈ వ్యవహారంలో వాస్తవాలు ప్రజలకు తెలియాలన్నారు. తప్పు చేయనివారు భయపడబోరని.. విజిలెన్స్ ఎంక్వైరీ అంటే సుబ్బారెడ్డి ఎందుకు భయపడ్డారని అనిత ప్రశ్నించారు.

స్వాగతించిన పవన్


తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారనే ఆరోపణలపై దర్యాప్తు కోసం స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ స్వాగతించారు. స్వతంత్ర సిట్ విచారణ ద్వారా అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. కల్తీ నెయ్యి వార్తల నేపథ్యంలో సనాతన ధర్మాన్ని విశ్వసించే వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. త టీటీడీ బోర్డు హయాంలోనే అన్నప్రసాదం, ప్రసాదంలో నాణ్యత లోపించిందన్న పవన్ కళ్యాణ్.. వారు తీసుకున్న నిర్ణయాలను పరిశీలించి సంస్కరణలు తెస్తామన్నారు. అలాగే తప్పుడు నిర్ణయాలు, అపవిత్ర చర్యలకు కారకులైన వారిని మాత్రం వదిలిపెట్టమని.. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మరోవైపు తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యిలో జంతువుల అవశేషాలు ఉన్నాయంటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపణలతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.

స్వాగతించిన వైసీపీ

సీబీఐ సిట్ బృందం విచారణను పూర్తిగా స్వాగతిస్తున్నామని వైసీపీ తెలిపింది. తిరుమల లడ్డూపై కేవలం దురుద్దేశపూర్వక ఆరోపణలు చేశారని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం నియమించిన సిట్ ఏ విధంగా న్యాయం చేయదు అనేది తమ భావనన్నారు. సుప్రీం కోర్టు సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఇవ్వడంతో తమకు నమ్మకం ఏర్పడిందన్నారు.

Tags

Next Story