AP: పార్టీల కటౌట్లు, హోర్డింగ్‌లు తొలగించండి

AP: పార్టీల కటౌట్లు, హోర్డింగ్‌లు తొలగించండి
క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలు... పారదర్శక ఎన్నికలే లక్ష్యమని వెల్లడి

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీల ప్రకటనల హోర్డింగ్ లు, కటౌట్లను వెంటనే తొలగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులతో... వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన క్షేత్రస్థాయిలో తనిఖీ బృందాలు విస్తృతంగా పర్యటించాలని నిర్దేశించారు. ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లో రాజకీయ ప్రకటనల హోర్డింగులను వెంటనే తొలగించాలని ఆదేశించారు. సచివాలయం పరిసర ప్రాంతాల్లోనూ...కటౌట్ లను వెంటనే తీసివేయాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని. అమలు చేసేలా చూడాలన్నారు. ఎలక్ట్రానిక్ సీజర్ మేనేజ్ మెంట్ సిస్టంను విస్తృతస్థాయిలో అమలు చేయాలన్నారు. సీ-విజిల్ ద్వారా అందే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. మరోవైపు ఎన్నికల కోడ్ దృష్ట్యా రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు తొలగిస్తుండగా విద్యుదాఘాతంతో సచివాలయ ఉద్యోగి మృతి చెందిన ఘటన... అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలం ములకలపల్లిలో జరిగింది. కొత్తపెంట సచివాలయానికి చెందిన వెల్ఫేర్ అసిస్టెంట్ చిరంజీవి ములకలాపల్లిలోని రాజకీయ పార్టీలకు చెందిన ఫ్లెక్సీలను తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు ప్లెక్సీ పైన ఉన్న విద్యుత్ తీగ తగిలి ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడికి భార్య.., ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రమాద స్థలాన్ని ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు పరిశీలించి.... కుటుంబ సభ్యులను ఓదార్చారు.


ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ప్రభుత్వ ఉద్యోగులపై..... ఈసీ తొలివేటు వేసింది. అధికార వైసీపీ నేతలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న VROను సస్పెండ్ చేసింది.శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం దిమ్మిలి VROను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పత్రికల్లో వచ్చిన వార్తలపై విచారణ చేసి VRO రమేష్ రాజకీయ పార్టీ ప్రచారంలో పాల్గొన్నట్టు తేలడంతో ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శాఖాపరంగానూ VRO రమేష్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన సందర్భంగా ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా ప్రజలకు సూచనలు, అభ్యర్థులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 4 కోట్ల 7 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు మీనా తెలిపారు. అందులో పురుషులు 2 కోట్ల మంది, మహిళలు 2 కోట్ల 7 లక్షల మంది ఉన్నట్లు తెలిపారు. 3 వేల 482 మంది థర్డ్ జెండర్‌ ఓటర్లు, 7603 మంది ఎన్‌ఆర్‌ఐలు ఉన్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 46 వేల 165 పోలింగ్ కేంద్రాలు ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించారు. ఎన్నికల్లో 4 లక్షల మంది ఉద్యోగులను వినియోగిస్తున్నామని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద భద్రత పెంచుతామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story