AP: జారీ చేసిన ప్రతీ జీవో అప్‌లోడ్ చేయాల్సిందే
జారీచేసిన ప్రతి జీవోనూ అప్‌లోడ్ చేయాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జగన్ సర్కార్‌కు స్పష్టంచేసింది. కొన్ని జీవోలను అప్‌లోడ్ చేసి, మరికొన్నింటిని చేయకపోవడం ఏంటన్న హైకోర్టు వాటిల్లో ఏం సమాచారం ఉందో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని వ్యాఖ్యానించింది. పౌరులకు జీవోలను అందుబాటులో ఉంచడంలో పారదర్శకత అవసరమన్న హైకోర్టు...అందుకు జీవోలను ఏ,బీ,సీ,డీలుగా వర్గీకరించి విధివిధానాలు రూపొందించాలని అభిప్రాయపడింది.
ప్రభుత్వ జీవోలను GOIR వెబ్‌సైట్లో ఉంచకపోవడం, ఏపీఈగెజిట్ వెబ్‌సైట్లో పరిమిత సంఖ్యలో ఆలస్యంగా అప్‌లోడ్ చేయడాన్ని సవాలు చేస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. గతంతో పోలిస్తే 5శాతం జీవోలను మాత్రమే ఏపీఈగెజిట్ వెబ్‌సైట్లో ఉంచుతున్నారని జీవోలు విడుదలైనట్లు పౌరులకు తెలియడం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. ప్రభుత్వ పాలన గురించి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందన్న వారు అప్‌లోడ్ చేయకపోవడంతో జీవోలపై అభ్యంతరం ఉంటే హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం లేకుండా పోతోందన్నారు. జీవోలను అందుబాటులో లేకుండా చేయడం రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను హరించడమేనన్నారు.
గోప్యత, అత్యంత గోప్యతగా జీవోలను వర్గీకరించి దాని ముసుగులో ముఖ్యమైన జీవోలను ఉద్దేశపూర్వకంగా బయటపెట్టడం లేదన్నారు. అన్ని జీవోలను స.హ చట్టం కింద పొందడం సాధ్యం కాదన్నారు. అత్యవసర జీవో అయితే జారీచేసిన మరుసటి రోజు, సాధారణ విధానంలో జారీచేసిన ఆరు రోజులలో జీవోలను అప్‌లోడ్ చేస్తున్నామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ వాదించారు. మెడికల్ రీయింబర్స్‌మెంట్, పెట్రోల్ అలవెన్సులు, జీతభత్యాలకు సంబంధించి ప్రాధాన్యత లేని జీవోలను మాత్రమే అప్‌లోడ్ చేయడం లేదన్నారు. ఈ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. ప్రభుత్వం జారీచేసిన జీవో 100లో ఏ,బీ,సీ,డీలుగా జీవోలను వర్గీకరించే విధివిధానం లేదని గుర్తుచేసింది. ప్రతి జీవోని వర్గీకరించి అప్‌లోడ్ చేయాల్సిందేనని...రహస్యంగా ఉంచాల్సిన సమాచారం అయితే ‘కాన్ఫిడెన్షియల్ ’ అని పేర్కొనవచ్చని ప్రభుత్వానికి స్పష్టంచేసింది. జీవోలను గోప్యం, అత్యంత గోప్యం, రహస్యంగా పేర్కొనడానికి అనుసరిస్తున్న విధానం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ఒకటో నంబరుతో జీవో అప్‌లోడ్ చేసి ఆ తర్వాత 18వ నంబరు జీవోని అప్‌లోడ్ చేస్తున్నారని, ఈ మధ్యలో జీవోల సంగతి ఏమిటని.... ఆ జీవోల్లో ఏముందో తెలుసుకునే హక్కు పౌరులకు ఉందని వ్యాఖ్యానించింది. రాజ్యాంగ పరమైన అంశాలు ఈ వ్యవహారంతో ముడిపడి ఉన్నందున లోతైన విచారణ అవసరమని పేర్కొంటూ నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ ఆర్.రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com