AP High Court : ఎమ్మెల్సీ కేసు విషయంలో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

AP High Court : ఎమ్మెల్సీ కేసు విషయంలో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
X

ఎమ్మెల్సీ రాజినామా కేసు విషయంలో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జయమంగళ వెంకటరమణ రాజీనామా అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలు ఆసక్తికరంగా మారాయి. పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయడంలో జాప్యం చేస్తున్న శాసనమండలి ఛైర్మన్‌ తరపు న్యాయవాదికి న్యాయస్థానం ఊహించని షాక్ ఇచ్చింది. మరింత సమయం కావాలంటే ఖర్చుల కింద రూ.10 వేలు చెల్లించాలని స్పష్టం చేసింది.

జయమంగళ వెంకటరమణ గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయన ఆ పార్టీలో చేరారు. అనంతరం వైసీపీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే, పార్టీలో తనకు తగిన గుర్తింపు లభించడం లేదనే కారణంతో 2024 నవంబర్‌లో తన ఎమ్మెల్సీ పదవికి, అలాగే వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ రాజీనామా లేఖను శాసనమండలి ఛైర్మన్ కే. మోషేన్ రాజుకు స్వయంగా అందజేశారు. అయితే, తన రాజీనామాను ఛైర్మన్ ఆమోదించకపోవడంతో, దానిని ఆమోదించేలా ఆదేశించాలని కోరుతూ వెంకటరమణ హైకోర్టును ఆశ్రయించారు.

దీంతో జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టారు. ఇప్పటికే పలుమార్లు గడువు ఇచ్చినా, మండలి ఛైర్మన్ తరఫు న్యాయవాది పదేపదే సమయం కోరడంపై న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మళ్లీ గడువు కోరడంతో, బుధవారం సాయంత్రం 5 గంటలలోపు లీగల్ సర్వీసెస్ అథారిటీకి రూ.10 వేలు చెల్లించాలని ఆదేశించారు. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.

Tags

Next Story