AP: గంజాయి నియంత్రణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌

AP: గంజాయి నియంత్రణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌
ఏపీలో గంజాయి అనే మాటే వినపడొద్దు.. హోంమంత్రి అనిత ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి నియంత్రణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. గంజాయి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై విశాఖలో పోలీస్‌ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ గంజాయి, మాదక ద్రవ్యాలకు రాజధానిగా మారిపోయిందని హోంమంత్రి గుర్తు చేశారు. యువతకు గంజాయి సులభంగా దొరుకుతోందని, ఆ మత్తులో వారు దోపిడీలు, చైన్‌స్నాచింగ్‌లు, ఈవ్‌టీజింగ్‌ వంటి నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించానన్నారు. హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టకముందే నగరంలోని పోలీస్‌ అధికారులతో సమావేశం ఏర్పాటుచేసి దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ చేశానని ఆమె తెలిపారు. వైజాగ్‌లో టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటుచేసి ఆకతాయిలను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించాలని, సోమవారం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం కావాలని ఆదేశాలిచ్చినట్టు తెలిపారు. గంజాయి కేసుల్లో పట్టుబడేవారు ఏ పార్టీవారైనా, చివరకు టీడీపీ వారైనా సరే క్షమించేది లేదని హెచ్చరించారు.


వైసీపీకి అంటకాగిన పోలీసులకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌

వైసీపీ ప్రభుత్వ హయాంలో కొంతమంది పోలీసులు జగన్‌ సేవలో తరించారని, టీడీపీ నేతలను వేధించడంలోనే మునిగితేలారని అనిత అన్నారు. తాము పోలీసులకు అన్ని సదుపాయాలూ కల్పిస్తామని, పనితీరు కూడా అదేస్థాయిలో ఉండాల్సిందేనని చెప్పారు. ఇప్పటికైనా ప్రజా పోలీసింగ్‌ చేయాలని, అలాకాకుండా ఎవరికైనా ఇంకా జగన్‌పై ప్రేమ ఉంటే తక్షణం లూప్‌లైన్‌లోకి వెళ్లిపోవాలని హోం మంత్రి స్పష్టం చేశారు. పోలీస్‌ వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తామన్నారు. ఏపీలో గంజాయి రవాణా, వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు వీలుగా వారంరోజుల్లో టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు హోంమంత్రి చెప్పారు.

నాదెండ్ల తనిఖీలు షురూ...

ఇప్పటికే ఏపీ ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాదెండ్ల మనోహర్‌ ఇప్పటికే వరుస తనిఖీలతో దూసుకుపోతున్నారు. అంగన్‌వాడీలకు ఇచ్చే కందిపప్పు, నూనెతో పాటు వైట్ రేషన్ కార్డుదారులకు ఇచ్చే పంచదారలో ఎక్కడ చూసిన తక్కువ తూకంతో సరుకులు పంపిణీ జరుగుతోందని గుర్తించారు. కందిపప్పు, నూనె అయితే 50 నుంచి 100 గ్రాములు తక్కువ ఉందని నిల్వ గోదాములను తనిఖీ చేసినప్పుడు వెల్లడైంది. అనంతరం మంగళగిరిలోనూ మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీలు చేయించారు. అక్కడ సైతం నిర్దేశిత పరిమాణం కంటే తక్కువ తూకంతో పంపిణీ జరుగుతున్నట్లు తేలింది. ఈ క్రమంలో ఏపీ వ్యాప్తంగా కందిపప్పు, పంచదార, నూనె ప్యాకెట్ల పంపిణీ నిలిపేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించడం తెలిసిందే. ఈ అవకతవకలు జరగడానికి కారణాలపై రెండు రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

Tags

Next Story