AP Liquor Scam : చెవిరెడ్డి భాస్కరరెడ్డి సహా నలుగురిపై సిట్ ఛార్జిషీట్

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో కీలక ముందడుగు పడింది. ఈ కేసును విచారిస్తున్న సిట్) విజయవాడలోని ఏసీబీ కోర్టులో రెండో ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ తాజా ఛార్జిషీట్‌లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి అత్యంత సన్నిహితుడిగా పేరున్న మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డితో పాటు మరో ముగ్గురిపై తీవ్ర ఆరోపణలు నమోదు చేశారు.
చెవిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు సిట్ దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం, రాష్ట్రంలో మద్యం సరఫరా చేసే సంస్థల నుంచి అక్రమంగా వసూలు చేసిన ముడుపులను గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల కోసం ఉపయోగించారు. ఈ డబ్బు పంపిణీకి సంబంధించిన మొత్తం వ్యవహారంలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి కీలక పాత్ర పోషించినట్లు సిట్ అభియోగపత్రంలో పేర్కొంది.
మరో ముగ్గురి పాత్ర చెవిరెడ్డితో పాటు, అతని సన్నిహితుడు సీహెచ్ వెంకటేశ్ నాయుడు (ఏ-34), ప్రధాన అనుచరుడు ఎం. బాలాజీ కుమార్ యాదవ్ (ఏ-35), వ్యక్తిగత సహాయకుడు ఈ నవీన్ కృష్ణ (ఏ-36) పాత్రలపై కూడా పూర్తి వివరాలు పొందుపరిచారు. ముడుపుల డబ్బును తరలించడం, కలెక్షన్ పాయింట్‌లకు చేరవేయడంలో వెంకటేశ్ నాయుడు కీలక పాత్ర పోషించారని, ఈ ప్రక్రియలో బాలాజీ యాదవ్, నవీన్ కృష్ణ సహకరించారని సిట్ వెల్లడించింది. డబ్బు తరలింపు కోసం తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ వాహనాలను ఉపయోగించినట్లు కూడా ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు.
డిజిటల్ ఆధారాలు, ఇతర నిందితులు ఈ ఛార్జిషీట్‌తో పాటు కాల్స్ వివరాలు, సెల్ టవర్ లొకేషన్లు, టవర్ డంప్స్, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు వంటి డిజిటల్ ఆధారాలను కూడా సిట్ కోర్టుకు సమర్పించింది. ఈ కేసులో ఇప్పటివరకు 29 మంది వ్యక్తులు, 19 సంస్థలను నిందితులుగా చేర్చారు. మొత్తం 12 మందిని అరెస్టు చేయగా, పైలా దిలీప్, కాల్వ ధనుంజయరెడ్డి, పెళ్లకూరు కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వెంకటేశ్ నాయుడు సహా మరో ఎనిమిది మంది ఇప్పటికీ జైలులోనే ఉన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com