AP: జగన్‌ సభంటే భయపడుతున్న ప్రజలు

AP:  జగన్‌ సభంటే భయపడుతున్న ప్రజలు
దుకాణాలు మూసివేత... బస్సులన్నీ జగన్‌ సభకే.... బస్సులు లేక ప్రజల తీవ్ర అవస్థలు..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ ఎక్కడ పర్యటించినా ప్రజలు, సామాన్యులకు, దుకాణ దారులకు తిప్పలు తప్పడం లేదు. సీఎం సభకు జనసమీకరణ చేయటానికి APSRTC బస్సులను ఉపయోగిస్తుండడంతో ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన సీఎం జగన్‌ సభ వద్ద చుట్టుపక్కల జిల్లాల్లో ప్రజలకు రవాణా సేవలందించే వందలాది బస్సులన్నీ బారులు తీరాయి. రాజధాని ప్రాంతం విజయవాడలో వందలాది బస్సు సర్వీసుల రద్దుతో వేలాది ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. విజయవాడలో 22 లక్షల మందికి పైగా ప్రజలు నివాసం ఉంటున్నారు.


ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధి చెందడమే కాకుండా విద్యా హబ్ గానూ, వాణిజ్య నగరంగానూ పేరొందింది. దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన అనేక విద్యా సంస్థలు విజయవాడ పరిసర ప్రాంతాల్లో నెలకొల్పడంతో అనేక ప్రాంతాల విద్యార్ధులు ఇక్కడ చదువుకుంటున్నారు. పండిట్ నెహ్రూ బస్‌ స్టేషన్‌ నుంచి రోజూ లక్షన్నర మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండగా సిటీ బస్సుల ద్వారానే లక్ష మంది వరకు అనేక ప్రాంతాలకు వెళ్తుంటారు. ఇంతటి కీలకమైన ప్రాంతంలో R.T.C. సిటీ బస్సుల సేవలు తరచూ అర్థాంతరంగా ఆగిపోతున్నాయి.


పేద మధ్యతరగతి ప్రజలకు సేవలందించే ప్రగతి రథ చక్రాలను సీఎం జగన్ సభలకు తరలిస్తుండటంతో నగరంలో ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. విజయవాడ సహా సమీప ప్రాంతాల్లో 380 సిటీ బస్సులు నిరంతరం తిరుగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలోనే కాదు.. చుట్టుపక్కల 10 జిల్లాల్లో ఎక్కడైనా సీఎం జగన్ సభ ఉందంటే చాలు.... నగరంలో రవాణా అతలాకుతలం అవుతోంది. C.M.O. హుకుం మేరకు సమీప జిల్లాల్లో ఎక్కడ సభ జరిగినా... ఇక్కడి బస్సులనే తరలిస్తున్నారు. ఒత్తిళ్లతో అధికారులు చేసేది లేక అడిగినన్ని బస్సులిస్తున్నారు. దీంతో బస్సుల్లేక ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. బుధవారం పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన సీఎం బహిరంగ సభకు చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుంచి 700 బస్సులు ఏర్పాటు చేసి జనాలను తరలించారు. రాజధాని ప్రాంతమైన విజయవాడలో 380 సిటీ బస్సులుండగా....150 బస్సులను సీఎం సభకు తరలించారు. ముందురోజు రాత్రి నుంచే భారీగా బస్సు సర్వీసులు నిలిచి ప్రజలు కష్టాలు పడ్డారు. సీఎం సభకు బస్సులను తరలించి... సామాన్యులను ఇబ్బందులు పె‌ట్టడం ఏంటని ప్రయాణికులు ప్రశ్నించారు. బస్సులు లేక విద్యార్థులు నానా అవస్థలు పడ్డారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి సహా... రాజధాని ప్రాంతం అమరావతిలోని సచివాలయం, హైకోర్టు, విభాగాధిపతుల కార్యాలయాల మీదుగా సర్వీసులు దాదాపు ఆగిపోయాయి. మంగళగిరి ఎయిమ్స్‌కూ...తరచూ ఆర్టీసీ బస్సులు నిలిచిపోతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story