AP: సోషల్ మీడియా వికృతకాండపై పోలీసుల ఉక్కుపాదం

AP: సోషల్ మీడియా వికృతకాండపై పోలీసుల ఉక్కుపాదం
X
రామ్‌గోపాల్ వర్మకు పోలీసుల నోటీసులు... శ్రీరెడ్డి, పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా వికృత కాండకు చెక్‌ పెట్టాలన్న పోలీసుల ప్రయత్నం కొత్త మలుపు తీసుకుంది. కీలక నేతలను లక్ష్యంగా చేసుకొని సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన వైసీపీ సానుభూతిపరులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌, వంగలపూడి అనిత ఫొటోలను మార్ఫింగ్‌ చేసి అసభ్యకరంగా తన ఎక్స్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసిన కేసులో సినీ డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మకు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 19న ఒంగోలు రూరల్‌ సర్కిల్‌ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆయన తనయుడు రాజగోపాల్‌రెడ్డిపై సోషల్‌ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలతో పోస్టులు పెట్టిన కేసుకు సంబంధించి వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. ముత్తుకూరు పోలీ్‌సస్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. కాకాణి 54 ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.


పోసానిపై కేసు

ప్రముఖ నటుడు, వైసీపీ హయాంలో ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా వ్యవహరించిన పోసాని కృష్ణమురళి కొత్త చిక్కులు మొదలయ్యాయి. ఇక ఇప్పుడు పోసాని కృష్ణమురళి మీద విజయవాడ లో కేసు నమోదు అయింది. ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళిపై.. జనసేన నాయకులు విజయవాడ భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రెస్ మీట్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని జనసేన నాయకులు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. జనసేన నాయకులు ఇచ్చిన ఫిర్యాదుతో పోసాని మురళికృష్ణ పై భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు.

శ్రీరెడ్డిపైనా..

సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రులు లోకేశ్‌, వంగలపూడి అనితను దుర్భాషలాడుతూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన నటి శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగు మహిళలు విశాఖపట్నం కంచరపాలెం, అనంతపురం, రాజమహేంద్రవరం రూరల్‌ మండలం బొమ్మూరు పోలీ్‌సస్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఫేస్‌బుక్‌లో ‘నేను మావా’ పేరుతో ఖాతా నిర్వహిస్తూ కూటమి నేతలు, వారి కుటుంబ సభ్యులను దూషిస్తూ అసభ్యకర పోస్టులు పెట్టిన శ్రీసత్యసాయి జిల్లా రొద్దం మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్త బాలాజీ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన పల్నాడు జిల్లా కంభంపాడు గ్రామానికి చెందిన నెమలిదిన్నె వెంకట రంగారెడ్డిని మాచర్ల రూరల్‌ పోలీసులు అరెస్టు చేశారు.

Tags

Next Story