AP: వల్లభనేని వంశీ కోసం గాలింపు ముమ్మరం

AP: వల్లభనేని వంశీ కోసం గాలింపు ముమ్మరం
వంశీ ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు... ఏ క్షణంలో అయినా అరెస్ట్‌..?

కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేసేందుకు పోలీసుల గాలింపు కొనసాగుతోంది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని ముద్దాయిగా చేర్చిన గన్నవరం పోలీసులు..ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో 19 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా, తాజాగా రమేష్, యూసఫ్‌ అనే ఇద్దర్ని అరెస్టు చేశారు. రమేష్‌ను కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్‌ విధించారు. యూసఫ్‌ను శనివారం కోర్టులో హాజరుపర్చనున్నారు. మరోపక్క వంశీ సహా, కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న పలువురిని అదుపులోకి తీసుకునేందుకు హైదరాబాద్‌ వెళ్లిన ప్రత్యేక పోలీసు బృందాలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా అక్కడే మకాం వేసిన అధికారులు..వంశీ సహా పలువురి కదలికలపై నిఘా ఉంచారు. నిన్న మధ్యాహ్నం వంశీని అరెస్టు చేసినట్లుగా సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరిగింది. కానీ అవన్నీ వదంతులేనని పోలీసులు కొట్టిపారేశారు.


ఈ కేసులో ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయడంతో వంశీ ప్రధాన అనుచరులు కొద్దిరోజుల కిందటే హైదరాబాద్‌లో మకాం వేశారు. సమాచారం అందుకున్న ఏపీ టాస్క్‌ఫోర్స్, శాంతిభద్రతల విభాగ పోలీసులు మూడు బృందాలుగా జూబ్లీహిల్స్, మాదాపూర్, రాయదుర్గం ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. రాయదుర్గంలోని గేటెడ్‌ కమ్యూనిటీలో నిందితులు తలదాచుకున్నట్టు తెలిసి అక్కడకు పోలీసులు వెళ్లేలోపు వారంతా పారిపోయారు. తప్పించుకున్న వారిలో వంశీ అనుచరుడు ఉన్నట్టు గుర్తించారు. సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించిన ఏపీ పోలీసులు.. అక్కడికి వస్తున్నట్టు వీరికి ముందుగానే సమాచారం అందినట్టు విశ్వసనీయ సమాచారం. దాంతో అప్పటికప్పుడే మరో ప్రాంతానికి చేరినట్టు నిందితులు తలదాచుకున్న గెటేడ్‌ కమ్యూనిటీ వాచ్‌మెన్‌ పోలీసులకు వివరించారు. పోలీసులు వస్తున్నట్లు వీరికి ముందుగానే సమాచారం చేరవేసిన వారు ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. అక్కడ ఉంటున్న వంశీ కుటుంబసభ్యులు రెండురోజుల కిందట వ్యక్తిగత పనుల మీద ఏపీ వెళ్లినట్టు స్థానిక పోలీసులు నిర్ధారించారు.

గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీని పోలీసులు 71వ నిందితుడిగా పేర్కొన్నారు. ఇక ఇప్పటికే ఈ కేసులో 18 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిలో వల్లభనేని వంశీ ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా.. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ప్రోద్బలంతోనే వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడి చేసి విధ్వంసం సృష్టించాయనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించింది.

Tags

Next Story