ప్రభుత్వంతో యుద్ధానికి సిద్ధమవుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు

ప్రభుత్వంతో యుద్ధానికి సిద్ధమవుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు
కేసు కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ వేసే అంశంపై కూడా చర్చించినట్టు సమాచారం.

ప్రభుత్వంతో యుద్ధానికి సిద్ధమవుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. సీఐడీ ఇచ్చిన నోటీసులు, పెట్టిన కేసులపై ఢీకొట్టేందుకు రెడీ అవుతున్నారు. అసలు సీఐడీ ఇచ్చిన నోటీసులకు అర్థంపర్థం లేదంటోంది టీడీపీ. కక్షసాధింపు చర్యల్లో భాగంగా నమోదు చేసిన కేసులపై కోర్టులోనే తేల్చుకునేందుకు సిద్ధమైంది. సీఐడీ నోటీసులపై న్యాయనిపుణులతో పాటు టీడీపీ లీగల్‌ సెల్‌తోనూ చర్చించారు చంద్రబాబు. వారి సూచనల ప్రకారం నోటీసులపై విచారణకు వెళ్లకూడదని భావిస్తున్నారు. సిఐడి నోటీసులపై ఇవాళ రేపట్లో కోర్టును ఆశ్రయించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కేసు కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ వేసే అంశంపై కూడా చర్చించినట్టు సమాచారం. మరోవైపు అరెస్టులు లేకుండా విచారణ జరిగేలా చూడాలని కోర్టులో పిటిషన్ వేసే అవకాశం కూడా ఉందంటున్నాయి టీడీపీ వర్గాలు. దీంతో ఈ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించి విచారిస్తుందా? లేదా సీఐడీ విచారణకు హాజరవ్వాలని స్పష్టం చేస్తుందా అన్నదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

చంద్రబాబుపై ఎస్సీ, ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టే అర్హత ఆళ్ల రామకృష్ణారెడ్డికి లేదంటోంది టీడీపీ. రాజధాని కోసం భూములు సేకరించేందుకు ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొచ్చి జీవో ఇచ్చినప్పుడు.. దాన్ని ప్రశ్నించే హక్కు పోలీసులకు ఉండదని కూడా వాదిస్తోంది. పైగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 41ని, గత చట్టాన్ని కోర్టులో తప్పుపట్టకుండా.. కేవలం అసైన్డ్ భూముల బదలాయింపు తప్పు అనడం కోర్టుల్లో చెల్లదని వాదిస్తున్నారు.

ల్యాండ్‌ పూలింగ్‌ కోసం గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్‌ 41ని ప్రశ్నిస్తే.. విశాఖలో భూసేకరణ కోసం జారీచేసిన జీవో నెంబర్ ‌72ని కూడా ప్రశ్నించాల్సి ఉందంటోంది టీడీపీ. న్యాయ, మున్సిపల్‌, రెవెన్యూ శాఖలు క్షుణ్ణంగా పరిశీలించాకే అప్పటి ప్రభుత్వం జీవో నెంబర్ 41 తీసుకొచ్చిందన్న టీడీపీ.. ఆ జీవో స్ఫూర్తిగానే ఇప్పటి ప్రభుత్వం కూడా విశాఖలో భూ సేకరణకు జీవో నెంబరు 72 జారీ చేసిందని గుర్తుచేసింది. ఒకవేళ జీవో 41 తప్పైతే.. జీవో నెంబర్ 72ను జారీ చేసిన సీఎం జగన్‌, మంత్రి బొత్స సత్యనారాయణలపై కూడా కేసు పెట్టాల్సి ఉంటుందని కౌంటర్‌ వేసింది. విశాఖ చుట్టుపక్కల 6వేల 116 ఎకరాల భూమిని లాండ్‌ పూలింగ్‌ విధానంలో సేకరించనున్నట్లు జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 72లో స్పష్టంగా ఉందంటున్నారు టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర.


Tags

Next Story