AP: ఏపీలో రోడ్డెక్కిన సర్పంచ్‌లు

AP: ఏపీలో రోడ్డెక్కిన సర్పంచ్‌లు
అన్ని కలెక్టరేట్ల ఎదుట సర్పంచ్‌ల ధర్నా, పంచాయతీ నిధులను జగన్‌ పక్కదారి పట్టించారని ఆరోపణలు

ఏపీలో సర్పంచ్‌లు రోడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ సర్పంచ్‌లు సైతం న్యాయం కోసం పోరుబాట పట్టారు. గ్రామపంచాయతీలకు కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని మండిపడ్డారు. సీఎం జగన్‌ తీరుకు నిరసనగా అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర సర్పంచ్‌లు ఆందోళనకు దిగారు. ఏపీ పంచాయతీరాజ్‌ చాంబర్‌ ఆధ్వర్యంలో నిరసనలు మిన్నంటాయి. కృష్ణాజిల్లా కలెక్టరేట్ దగ్గర వైవీబీ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో సర్పంచ్‌లు ధర్నా చేశారు. ప్రభుత్వ తీరును ఖండిస్తూ నిప్పులు చెరిగారు. 14, 15వ ఆర్థిక సంఘం నిధులు 8,660 కోట్ల రూపాయలను జగన్‌ స్వాహా చేశారని ఆరోపించారు. విజయవాడ కలెక్టరేట్‌ దగ్గర సర్పంచ్‌ల ధర్నాతో ఉద్రిక్తత తలెత్తింది. ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

జగన్‌ సర్కార్‌ తీరుపై కర్నూలు జిల్లాలో సర్పంచ్‌లు వినూత్నంగా నిరసన తెలిపారు. పంచాయతీ నిధులు జగన్‌ స్వాహా చేశాడంటూ ఆరోపించారు. ఇతర పథకాలకు పంచాయతీల నిధులను మళ్లించారన్నారు. కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట గోవింద నామాలతో నిరసనకు దిగారు. గోవిందా.. గోవిందా అంటూ నినాదాలు చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కలెక్టరేట్‌ గేటు ముందు అర్ధనగ్నంగా ఆందోళన నిర్వహించారు. అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు.

ఏలూరు కలెక్టరేట్‌ ఎదుట జోరు వర్షంలోనూ సర్పంచ్‌లు ఆందోళనలు నిర్వహించారు. సచివాలయం వ్యవస్థను పంచాయతీల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ దొంగిలించిన నిధులను, విధులను తక్షణమే పంచాయతీలకు బదిలీ చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. ఎన్నికల సమయంలో సర్పంచ్‌లకు ఇచ్చిన హామీల్లో జగన్‌ ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు జగన్‌ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని సర్పంచ్‌లు ధ్వజమెత్తారు. వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి పంచాయతీలను అధ్వాన్నంగా తయారుచేశారని వారు మండిపడ్డారు.

డిమాండ్లు పరిష్కరించాలని అనంతపురంలో సర్పంచ్‌లు ధర్నా చేశారు. సంగమేశ్వర్‌ సర్కిల్‌ నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు ర్యాలీ తీశారు. కలెక్టరేట్‌ దగ్గర పోలీసులు అడ్డగించడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సర్పంచ్‌లు నినాదాలు చేశారు. పంచాయతీ నిధులను సీఎం జగన్‌ పక్కదారి పట్టించారని సర్పంచ్‌లు మండిపడ్డారు. నాలుగేళ్ల పాలనలో జగన్‌ చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. గ్రామపంచాయతీలకు నిధులు కేటాయించి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని సర్పంచ్‌లు హెచ్చరించారు.

కాకినాడ కలెక్టరేట్‌ను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సర్పంచ్‌లు ముట్టడించారు. పంచాయతీ ఖాతాల్లో 14, 15వ ఆర్థిక సంఘం నిధులు ఏమైపోయాయని ప్రశ్నించారు. సైబర్‌క్రైమ్‌ కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని...స్పందనలో సర్పంచ్‌లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

విజయనగరం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట సర్పంచ్‌లు ధర్నా చేశారు. సర్పంచ్‌లకు చెప్పకుండా సీఎఫ్‌ఎంఎస్‌ అకౌంట్ల నుంచి ప్రభుత్వం నిధులను దొంగిలించిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సొంత అవసరాలకు, ఇతర పథకాలకు పంచాయతీల నిధులను దారి మళ్లించడం దారుణమని సర్పంచ్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే 8660 కోట్ల రూపాయలను పంచాయతీల ఖాతాల్లో జమ చేయాలని సర్పంచ్‌లు డిమాండ్‌ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story