AP: త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని త్వరలోనే అమలు చేస్తామని రవాణశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణం అమలవుతున్న తరుణంలో... మరింత లోతుగా అధ్యయనం చేసి పొరపాట్లకు తావులేకుండా రాష్ట్రంలో ప్రవేశ పెడతామన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి కడపకు వచ్చిన రాంప్రసాద్ రెడ్డికి శ్రేణులు ఘనస్వాగతం పలికారు.
స్పీడు పెంచిన లోకేశ్
ఏడాదిలోగా బడుల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని.. మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కొత్తగా చేపట్టాల్సిన పనులతో పాటు గత ప్రభుత్వంలో అర్థాంతరంగా నిలిచిన...ఫేజ్-2, ఫేజ్-3 పనులన్నీ ఏడాదిలోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజనం నాణ్యతపైనా ఆరా తీశారు. పాఠశాలల్లో పారిశుద్ధ్యం నిర్వహణకు సంబంధించి దిల్లీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఇతర రాష్ట్రాల్లో స్కూల్స్ శానిటేషన్ కు సంబంధించిన విధానాల అధ్యయనానికి ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్ల నుంచి ప్రైవేటు పాఠశాలలకు మారిన విద్యార్థుల సంఖ్య, అందుకు గల కారణాలను విశ్లేషించి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. డ్రాప్ అవుట్స్ వివరాలూ అందజేయాలన్నారు.
ఎన్ని పాఠశాలలు మూతపడ్డాయి, అందుకు కారణాలను తెలియజేయాలని... బైజూస్ కంటెంట్, ఐబీ వినియోగంపై నివేదిక సమర్పించాలని సూచించారు. సీబీఎస్ఈ పాఠశాలలపై నివేదిక కోరారు. నెలాఖరులోగా స్టూడెంట్ కిట్ అందించాలని.. ఇంటర్ విద్యార్థులకు జులై 15నాటికి పాఠ్యపుస్తకాలు ఇవ్వాలన్నారు. ఇకపై ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా జరుగుతాయని లోకేష్ స్పష్టం చేశారు. మరోవైపు సొంత నియోజకవర్గం మంగళగిరిలో సమస్యల పరిష్కారానికి.. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గత ఐదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నా...సేవా కార్యక్రమాలతో మంగళగిరి ప్రజల మనసు గెలిచుకున్న లోకేష్ మంత్రి అయ్యాక సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు...ప్రజా దర్బార్ నిర్వహించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com