AP: టీడీపీ కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో..వైసీపీ నేతల దాడి

AP: టీడీపీ కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో..వైసీపీ నేతల దాడి
టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జి చదలవాడ అరవిందబాబు, ఆయన కారు డ్రైవర్‌, పలువురు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి.

పల్నాడు జిల్లా నరసరావుపేటలో వైసీపీ నాయకులు విధ్వంసం సృష్టించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో విరుచుకుపడ్డారు. టీడీపీ నేత చల్లా సుబ్బారావు ఇంటిపై దాడి చేశారు. ఈ ఘటనతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. దాడిలో టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జి చదలవాడ అరవిందబాబు, ఆయన కారు డ్రైవర్‌, పలువురు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. వాహనాలు ధ్వంసమయ్యాయి. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సమక్షంలోనే వైసీపీ వర్గీయులు రెచ్చిపోయారని టీడీపీ ఆరోపిస్తోంది. పోలీసులు టీడీపీ నాయకులను చెదరగొట్టి, వైసీపీ నాయకులను ప్రోత్సహించారనే ఆరోపణలు వస్తుననాయి. ఎమ్మెల్యే గోపిరెడ్డిపై అవినీతి ఆరోపణలు చేయడంతోనే వైసీపీ శ్రేణులు ఈ దాడికి పాల్పడ్డాయని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

టీడీపీ నేత చల్లా సుబ్బారావు ఇంటి వద్ద ఉన్న ఓ స్థానికుడి ఇంటిపై వివాదం నడుస్తోంది. అతడు టీడీపీ, వైసీపీ వర్గీయుల వద్ద అప్పు తీసుకోగా, ఆ ఇల్లు తమదంటే తమదని ఇరువర్గాలూ గొడవ పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ వర్గీయులు పెద్దసంఖ్యలో సుబ్బారావు ఇంటివద్దకు వెళ్లారు. ఇంటి విషయంతో పాటు ఎమ్మెల్యే గోపిరెడ్డిపై అవినీతి ఆరోపణలు చేశారంటూ తొలుత వాదులాడి.. చివరకు కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో సుబ్బారావు ఇంటి కిటికీలు, ఫర్నిచర్‌ ధ్వంసమయ్యాయి. టీడీపీ ఇంఛార్జి చదలవాడ అరవిందబాబుకు ఆయన ఫోన్లో చెప్పగా.. వెంటనే అక్కడకు చేరుకున్నారు. అరవిందబాబు కారు దిగుతుండగానే ఆయనపై వైసీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. టీడీపీ కార్యకర్తలు వారిని అడ్డుకోగా.. వారందరిపై రాళ్లు రువ్వారు. దీంతో మరికొందరు టీడీపీ కార్యకర్తలు చల్లా సుబ్బారావు ఇంటికి వెళ్లగా వారిపైనా విరుచుకుపడటంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అక్కడకు రాగానే వైసీపీ కార్యకర్తలు మరింత రెచ్చిపోయారు. అక్కడ ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తల్ని దొరికినవారిని దొరికినట్లు గాయపరుస్తూ బీభత్సం సృష్టించారు. సుబ్బారావు నివాసం ఆక్రమించుకున్నదేనని, తమ నాయకుడిపై అవినీతి ఆరోపణలు చేయడానికి ఎంత ధైర్యం అంటూ మండిపడ్డారు. అదే సమయంలో టీడీపీకి చెందిన కడియాల రమేష్‌ తదితరులు అక్కడకు వెళ్లగా, వారి వాహనాలపైనా రాళ్లతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో అరవిందబాబు డ్రైవర్‌ తలకు తీవ్ర గాయమైంది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు వాహనాల్లో తలదాచుకోవడానికి వెళ్తుంటే వాటిని వెంబడించి ధ్వంసం చేశారు. కార్లు వదిలేసి వెళ్తుండగా రాళ్లు రువ్వడంతో టీడీపీ కార్యకర్తలు, నాయకులు గాయపడ్డారు.

గొడవ మొదలైనా పోలీసులు తగినంత సంఖ్యలో రాకపోవడం కూడా వైసీపీ శ్రేణులు రెచ్చిపోవడానికి కారణమైందనే విమర్శలు వస్తున్నాయి. టీడీపీ నాయకులు, కార్యకర్తలు గాయపడి, వారి వాహనాలు ధ్వంసమయ్యాక అప్పుడు వచ్చి హడావుడి చేశారని ఆరోపణలు వస్తున్నాయి. దాడికి పాల్పడుతున్నవారిని చెదరగొడుతున్న పోలీసులపైనా వైసీపీ కార్యకర్తలు ఎదురుతిరిగినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు వైసీపీ వారిని వదిలేసి, టీడీపీ శ్రేణుల్ని చెదరగొట్టడంపైనే దృష్టిపెట్టారని మండిపడుతున్నారు.

Tags

Next Story