AP: ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డి అరెస్ట్

AP: ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డి అరెస్ట్
X
నేడు కోర్టులో హాజరుపర్చనున్న ఏసీబీ... వైసీపీ హయాంలో ఇసుక దోపిడీలో కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు

వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గనుల శాఖ మాజీ డైరెక్టర్‌ వీజి వెంకట్‌రెడ్డిని ఏసీబీ అరెస్టు చేసింది. తప్పించుకొని తిరుగుతున్న వెంకటరెడ్డిని గురువారం రాత్రి హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. గనుల శాఖలో టెండర్లు, అగ్రిమెంట్స్‌, ఇసుక తవ్వకాల్లో అవినీతి, నేరపూరిత కూట్ర, అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగాలు ఆయనపై ఉన్నాయి. వెంకటరెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు మరి కాసేపట్లో విజయవాడ కోర్టులో హాజరుపరచనున్నారు.

పట్టుబడ్డారా... లొంగిపోయారా

వెంకటరెడ్డి పట్టుబడ్డారా లేక లొంగిపోయారా అన్నదానిపైనే తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. కడప జిల్లాకు చెందిన వెంకటరెడ్డి కేంద్ర సర్వీసులకు చెందిన స్టాఫ్‌ ఆఫీసర్‌ స్థాయి ఉద్యోగి. ఏపీలో 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇక్కడ అడుగు పెట్టారు. పంచభూతాల్లో ఒకటైన ఇసుక, మైనింగ్‌ జగన్‌ అనుయాయులకు దోచిపెట్టారు. ఇసుక టెండర్లు పాడుకున్న జేపీ వెంచర్స్‌తో కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు 800కోట్లు ప్రత్యక్షంగా నష్టం చేకూర్చారు. బయటికి కనిపించకుండా వేలకోట్ల రూపాయల సంపద దోపిడీకి సహకరించిన వెంకట రెడ్డి, అందులో సింహ భాగం తాడేపల్లి ప్యాలెస్‌కు చేర్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పోయి ఎన్డీఏ సర్కారు ఏర్పడటంతో అక్రమాల నిగ్గు తేల్చే ప్రక్రియ ప్రారంభమైంది. చంద్రబాబు ప్రభుత్వం ప్రాథమిక నివేదిక తెప్పించుకుని ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించింది.

రెండు నెలలుగా గాలింపు

ఆగస్టు 31న వెంకటరెడ్డిపై కేసు నమోదు చేసిన ఏసీబీ....కడప, తిరుపతి, విజయవాడతోపాటు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో గాలించింది. అయితే ప్రభుత్వం మారగానే విదేశాలకు పారిపోయినట్లు వార్తలు రావడంతో ఆదిశగా ఏసీబీ నిఘా పెట్టింది. ఇదే సమయంలో వెంకట రెడ్డి ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నించగా అప్రమత్తమైన ఏసీబీ... ఆయనకు బెయిల్‌ రాకుండా అడ్డుపడింది. దిక్కుతోచని వెంకట రెడ్డి మధ్యవర్తుల ద్వారా ఏసీబీ అధికారులను సంప్రదించినట్లు సమాచారం. మర్యాదగా లొంగిపోయి విచారణకు సహకరిస్తే తాము కఠినంగా వ్యవహరించబోమని, అలా కాకుండా వ్యతిరేకంగా వ్యవహరిస్తే తమదైన శైలిలో చర్యలుంటాయని వారు హెచ్చరించారు. దీంతో వెంకటరెడ్డి ఎట్టకేలకు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చి లొంగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.

Tags

Next Story