AP : సీఎం జగన్‌పై దాడి కేసులో సతీశ్‌కు బెయిల్ మంజూరు

AP : సీఎం జగన్‌పై దాడి కేసులో సతీశ్‌కు బెయిల్ మంజూరు
X

సీఎం జగన్‌పై గులకరాయితో దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్న సతీశ్‌కు విజయవాడ 8వ అదనపు జిల్లా న్యాయస్థానం కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. ప్రతి శని, ఆదివారాలు పీఎస్‌లో సంతకం చేయాలని కోర్టు ఆదేశించింది. రూ.50వేల ష్యూరిటీ సమర్పించాలని తెలిపింది. కాగా సతీశ్ ప్రస్తుతం నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.

విజయవాడలో ఏప్రిల్ 13న సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పాల్గొన్నారు. బస్సు ఎక్కి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో కొందరు ఆయనపై పూలతోపాటు రాళ్లు విసిరారు. దీంతో జగన్ ఎడమకంటికి గాయం అయ్యింది. ఈ అంశం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఘటనపై వైసీపీ నేతలు హత్యాయత్నం కేసు పెట్టారు. దీంతో సింగ్ నగర్ చెందిన దుర్గారావు, సతీశ్‌తోపాటు పలువురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

టీడీపీ నేతల ప్రోద్బలంతోనే దాడి జరిగిందంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. అయితే దాడి జరిగిన సమయంలోనే కరెంట్ పోవడం ఏంటని టీడీపీ నేతలు ప్రశ్నించారు. కావాలనే దాడి చేయించుకొని ప్రతిపక్షాలపై నెట్టడం సీఎం జగన్‌కు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. 2014ఎన్నికల్లోనూ కోడికత్తి డ్రామా ఆడారంటూ మండిపడ్డారు.

Tags

Next Story