AP: ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీ కొట్టడం వెనక కుట్ర..!
ప్రకాశం బ్యారేజీ గేట్లను విరగొట్టాలన్న కుట్ర జరిగిందా..? గేట్లు విరగొట్టి వరదతో విజయవాడను ముంచేసి.. చంద్రబాబు ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే వ్యుహం పన్నారా..? బ్యారేజీ గేట్లను మూడు పడవలు ఢీ కొట్టడం వెనక వైసీపీ నేతల హస్తుముందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ప్రకాశం బ్యారేజి గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర కోణం ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఒక్కోటి 40-50 టన్నుల బరువున్న బోట్లు.. ఢీకొడితే బ్యారేజి గేట్లు దెబ్బతిని కొట్టుకుపోతాయని, తద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలనే దురుద్దేశంతోనే వాటిని గట్టిగా కట్టకుండా వదిలేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తం అయిదు పడవలు గేట్లను ఢీకొట్టగా.. అందులో మూడు గొల్లపూడికి చెందిన వక్కలగడ్డ ఉషాద్రివేనని పోలీసులు తేల్చారు. ఈయన సూరాయపాలెంకు చెందిన కోమటి రామ్మోహన్‌కు అనుచరుడు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్సీ తలశిల రఘురాంకు రామ్మోహన్ దగ్గరి బంధువు అని పోలీసులు గుర్తించారు. మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు దగ్గరై.. రామ్మోహన్, ఉషాద్రి ఆయన లారీలకు ఇసుక సరఫరా చేసేవారని కూడా తేలింది.
సాధారణంగా పడవల్ని వేటికవే నది ఒడ్డున లంగరు వేసి కట్టి ఉంచుతారు. ఇక్కడ మాత్రం మూడు పడవల్నీ కలిపి ప్లాస్టిక్ తాళ్లతో కట్టి ఉంచారు. కృష్ణా నదిలో నీటిమట్టం పెరుగుతున్న సమయంలో.. ఏ పడవకు ఆ పడవను లంగరేసి గట్టిగా కట్టమని స్థానికులు హెచ్చరించినా యజమానులు పట్టించుకోలేదని పోలీసుల దృష్టికి వచ్చింది. పెద్ద పడవలైన ఇవి బ్యారేజి వద్దకు కొట్టుకుపోయి ప్రమాదం జరుగుతుందని చెప్పినా నిర్లక్ష్యం చేశారని పోలీసులకు కొందరు వివరించినట్లు తెలుస్తోంది. వీటన్నింటి నేపథ్యంలో నిందితుల కాల్ డేటాతో పాటు, గూగుల్ టేకవుట్ వివరాల్ని పోలీసులు సేకరిస్తున్నారు. రామ్మోహన్, ఉషాద్రిలను పోలీసులు అదుపులోకి తీసుకుని వివరాలు రాబడుతున్నారు.
పడవల్ని కొద్ది రోజుల కిందటే ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని గొల్లపూడి వైపు తెచ్చి నిలిపారని దర్యాప్తులో తేలింది. అంతకు ముందు వరకు అవి గుంటూరు జిల్లా వైపు ఉన్న ఉద్దండరాయనిపాలెం వైపు ఉండేవి. కొద్ది రోజుల కిందటే వీటిని ఎందుకు తెచ్చారు, గొల్లపూడి రేవు దగ్గరున్న శ్మశానం దగ్గర ఎందుకు కట్టి ఉంచారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఈనెల 2న ప్రకాశం బ్యారేజీకి 11.42 లక్షల క్యూసెక్కుల మేర వరద వచ్చింది. అదే రోజు వేకువజామున 3 గంటల సమయంలో ఎగువ నుంచి పడవలు కొట్టుకువచ్చాయి. 67, 68, 69 గేట్లను ఢీకొట్టాయి. వీటిలో ఒకటి ప్రవాహంలో దిగువకు కొట్టుకుపోయింది. మరొకటి జాడ కనిపించలేదు. మిగిలిన వాటి కారణంగా రెండు గేట్లు దెబ్బతిన్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com