AP: ప్రజల్లో ప్రభుత్వంపై పూర్తి నమ్మకం: కేంద్ర బృందం

AP: ప్రజల్లో ప్రభుత్వంపై పూర్తి నమ్మకం: కేంద్ర బృందం
X
ప్రభుత్వం సాయం చేస్తుందని ప్రజలు నమ్ముతున్నారన్న కేంద్ర బృందం... ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు కేంద్రబృందం జిల్లాల్లో పర్యటిస్తోంది. రైతులు, బాధితులను కలుసుకుని నష్టాన్ని అంచనా వేస్తోంది. ఈ క్రమంలో కేంద్ర బృందం.. కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంత స్థాయి వరదలు, బాధల అనంతరం కూడా ప్రజలు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై ఎంతో నమ్మకంతో ఉన్నారని.. కేంద్ర బృందానికి నాయకత్వం వహించిన కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సుబ్రహ్మణ్యం అన్నారు. వరద ప్రాంతాల్లో త‌మ బృందం జ‌రిపిన ప‌ర్యట‌న‌కు సంబంధించి తమ అనుభవాలను ముఖ్యమంత్రికి వివ‌రించారు.

ఇంత స్థాయి వరదలు, బాధలు అనంతరం కూడా ప్రజలు ప్రభుత్వంపై ఎంతో నమ్మకంతో ఉన్నారని... ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వారికి సాంత్వన చేకూర్చాయని అనిల్‌ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇంత కష్టంలోనూ ప్రజల్లో ఎక్కడా ప్రభుత్వం పట్ల అసంతృప్తి, ఆగ్రహం కనిపించలేదన్నారు. తమకు ప్రభుత్వం న్యాయం చేస్తుంది.. సాయం చేస్తుంది.. అనే నమ్మకం వారిలో ఉంది. డ్రోన్ల వంటి వాటి ద్వారా ప్రభుత్వ సహాకయ చర్యలు ఎంతో వినూత్నంగా సాగాయని ఆయన అన్నారు. భారీగా పంట నష్టం జరిగిందని.. మౌలిక సదుపాయాల పరంగా తీవ్రం నష్టం జరిగిందని తమకు క్షేత్ర స్థాయి పర్యటన ద్వారా తెలిసిందన్నారు. బుడమేరు వరదల పై ప్రజలు తమ బాధలు చెప్పుకున్నారని... దాదాపు 60 ఏళ్ల తరువాత ఇలాంటి వరదలు వచ్చాయని ప్రజలు తమతో చెప్పినట్లు వెల్లడించారు.

జాతీయ విపత్తుగా ప్రకటిస్తేనే..

ఆంధ్రప్రదేశ్‌లో వరద నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర బృందాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ఊహించని విపత్తు తలెత్తి…అపార నష్టాన్ని, కష్టాన్ని కలిగించిందని చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్రం ప్రజలను ఆదుకునేందుకు ఉదారత చూపాలని సీఎం కోరారు. వరద నష్టాలపై అంచనాల కోసం ఏర్పాటైన కేంద్ర బృందంతో సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఏపీలో వచ్చిన ఈ విపత్తును సాధారణ విపత్తులా, గతంలో వచ్చిన వరదల్లా చూడవద్దని కేంద్ర బృందాన్ని చంద్రబాబు కోరారు. రికార్డు స్థాయి వర్షాలు, ఆకస్మిక వరదలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేశాయని.. కేంద్రం ఉదారంగా ఆదుకునే విధంగా చూడాలని కేంద్ర బృందాన్ని కోరారు. ప్రజల ఆస్తులకు తీవ్ర నష్టం జరిగిందని.. పంటలు నీళ్లలో మునిగి రైతులు కుదేలయ్యారని సీఎం అన్నారు. ప్రాణ, ఆస్థి నష్టంతో పాటు…తాగడానికి నీళ్లు, తినడానికి తిండి లేక ప్రాణభయంతో తీవ్ర క్షోభను అనుభవించారని సీఎం చెప్పారు. ప్రజలను తిరిగి నిలబెట్టేలా కేంద్రం సాయం చేసేలా చూడమని కేంద్ర బృందాన్ని కోరారు.

Tags

Next Story