కేంద్ర మంత్రి సమాధానంతో జగన్‌ సర్కార్‌కు గట్టి ఎదురుదెబ్బ

కేంద్ర మంత్రి సమాధానంతో జగన్‌ సర్కార్‌కు గట్టి ఎదురుదెబ్బ
కేంద్ర మంత్రి సమాధానంతో జగన్‌కు గట్టి ఎదురుదెబ్బే తగిలింది.

రామాయపట్నం పోర్టు విషయంలో జగన్ ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చింది కేంద్రం. పోర్టును మీరే కట్టుకోవాలి తప్పితే కేంద్రం నుంచి నయో పైసా రాదని తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం మార్చిన విధానాల వల్లే రామాయపట్నం పోర్టుకు తాము సాయం అందించడం లేదని కేంద్రప్రభుత్వం కుండబద్దలు కొట్టి మరీ చెప్పింది. రామాయపట్నాన్ని జగన్ ప్రభుత్వం నాన్‌ మేజర్ పోర్టుగా మార్చడం వల్లే సాయం అందించడం లేదని కేంద్రం చాలా స్పష్టంగా చెప్పింది.

సుదీర్ఘ సముద్రతీరాన్ని ఉపయోగించుకుని గేట్‌వే ఆఫ్ ఇండియాగా మార్చుదానుకుంది గత ప్రభుత్వం. అందుకే, దుగరాజపట్నం పోర్టును ప్రతిష్టాత్మకంగా భావించింది. కాని, జగన్‌ వచ్చాక దుగరాజపట్నం ప్లేసులో మరో పోర్టు సూచించాలని కోరింది కేంద్రం. దుగరాజపట్నానికి ప్రత్యామ్నాయంగా రామాయపట్నం పోర్టును తెరపైకి తెచ్చింది. అయితే, జగన్‌ చేసిన ఓ పొరపాటు వల్ల రాష్ట్ర ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. రామాయపట్నాన్ని నాన్‌ మేజర్‌ పోర్టుగా మార్చడంతో.. ఆ రేవుతో తమకు సంబంధం లేదని కేంద్రం తేల్చి చెప్పింది.

కేంద్రం మేజర్‌ పోర్టుల నిర్మాణాన్ని మాత్రమే చేపడుతుందని, నాన్‌ మేజర్ పోర్టులకు సాయం అందివ్వలేమని చెప్పింది. ఏడాది క్రితం రామాయపట్నాన్ని నాన్‌-మేజర్‌ పోర్టుగా మారుస్తూ నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయాన్ని కేంద్రం గుర్తు చేస్తోంది. ఒకవేళ రామాయపట్నాన్ని మేజర్ పోర్టుగానే ఉంచినట్టైతే కేంద్ర సాయం దక్కేదని, ఇప్పుడు మాత్రం పోర్టుల నిర్మాణ బాధ్యత రాష్ట్రప్రభుత్వానిదేనని చెప్పింది. రాజ్యసభలో టీజీ వెంకటేశ్‌, జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవియా లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.

జగన్‌ అధికారం చేపట్టిన కొత్తలో రామాయపట్నాన్ని మేజర్‌ పోర్టుగానే పరిగణించారు. ఏమైందో తెలీదు గాని.. రామయపట్నాన్ని మైనర్‌ పోర్టుగా మారుస్తూ ఫిబ్రవరి 20న నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఒక ఫార్మా కంపెనీ పోర్టు నిర్మాణానికి ఆసక్తి చూపుతోందని, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్థికంగానూ సహకరిస్తుందని కొద్దిరోజుల కిందటే జగన్‌ ప్రకటించారు. అయితే రామాయపట్నాన్ని నాన్‌-మేజర్‌ పోర్టుగా నోటిఫై చేసినందున.. అక్కడ మేజర్‌ పోర్టు ఏర్పాటు అవసరం లేదని కేంద్ర మంత్రి మాండవియా పార్లమెంటులో చెప్పేశారు. కేంద్ర మంత్రి సమాధానంతో జగన్‌కు గట్టి ఎదురుదెబ్బే తగిలింది.

అసలు రామాయపట్నాన్ని మైనర్‌ పోర్టుగా నోటిఫై చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తోంది ప్రధాన ప్రతిపక్షం. మేజర్‌పోర్టుకు కేంద్రమే నిధులను భరిస్తున్నప్పుడు.. నాన్ మేజర్ పోర్టుగా ఎందుకు మార్చారని నిలదీస్తోంది. మోదీ సర్కారుకు వెసులుబాటు కలిగించేలా జగన్‌ ప్రవర్తిస్తున్నారని వామపక్షాలు అప్పుడే విమర్శలు ఎక్కుపెట్టాయి కూడా. తన సన్నిహిత ఫార్మా కంపెనీకి పోర్టు కట్టబెట్టాలన్న ఉద్దేశంతోనే.. రామాయపట్నం విషయంలో రాష్ట్రానికి నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నరని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సంక్షేమ పథకాలకే అప్పులు చేస్తున్నప్పుడు పోర్టుల నిర్మాణం చేపట్టడం ఏంటని ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. అయినా ఒక ఫార్మా కంపెనీకి పోర్టు నిర్మాణ బాధ్యతలు అప్పగించడమేంటని ప్రశ్నించారు.


Tags

Read MoreRead Less
Next Story