Chandra babu: ఢిల్లీలో సీఎం నివాసంలోకి అడుగుపెట్టిన చంద్రబాబు

చంద్రబాబుకు ఢిల్లీలో 1 జన్ పథ్ నివాసం కేటాయింపు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో గృహప్రవేశం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు దేశ రాజధానిలోని '1 జన్ పథ్' నివాసాన్ని కేటాయించారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు, తన అధికారిక నివాసంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, లోక్ సభలో టీడీపీ పక్ష నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్), సీఎంవో అధికారులు పాల్గొన్నారు.

అధికార పర్యటనల నిమిత్తంఢిల్లీకొచ్చే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి బస కోసం ఢిల్లీలో కేటాయించిన 1-జన్‌పథ్‌లోని నివాసంలోకి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం అడుగుపెట్టారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలవడానికి మంగళవారం దిల్లీకొచ్చిన ఆయన బుధవారం తొలి ఏకాదశి కావడంతో సంప్రదాయబద్ధంగా పూజలు చేసి ఇంట్లోకి ప్రవేశించారు. 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం ఏపీ ముఖ్యమంత్రి కోసం ఈ నివాసాన్ని కేటాయించింది. ఈ నివాసం కేటాయించక ముందు ఏపీ భవన్‌లో బస చేసే ఆయన తర్వాత పూర్తిగా ఇక్కడికి మారిపోయారు. 2019-24 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి కూడా దిల్లీ వచ్చిన ప్రతిసారీ ఇక్కడే బస చేసేవారు. ఆయన ఖాళీ చేశాక చిన్నచిన్న మరమ్మతులు చేయాల్సి ఉండటంతో.. చంద్రబాబు గతనెల 12న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక దిల్లీకొచ్చిన ప్రతిసారీ ఇక్కడ మాజీ ఎంపీ గల్లా జయదేవ్‌కు కేటాయించిన 50 అశోకా రోడ్డులో ఉంటూ వచ్చారు. ఇప్పుడు అధికార నివాసం సిద్ధం కావడంతో ఆయన బుధవారం శాస్త్రోక్తంగా పూజలు చేసి అందులో ప్రవేశించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్, తెదేపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీలు కేశినేని శివనాథ్, దగ్గుమళ్ల ప్రసాదరావు, భాజపా ఎంపీ సీఎం రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమ అనంతరం చంద్రబాబునాయుడు విజయవాడ తిరుగు పయనమయ్యారు. ఈనెల 27న నీతిఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొనడానికి 26న సాయంత్రం తిరిగి ఢిల్లీకి రానున్నట్లు సమాచారం.

Tags

Next Story