Chandrababu: జగన్ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారన్న చంద్రబాబు

Chandrababu:  జగన్  తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారన్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ను నాశనం చేశారన్న మాజీ సీఎం

సీఎం జగన్ రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా చేసి... చివరికి ఉన్న రాజధాని అమరావతిలోని రాష్ట్ర సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టేశారంటూ తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని సీఎం జగన్ తాకట్టు పెట్టారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్ర సచివాలయాన్ని రూ.370 కోట్లకు తాకట్టు పెట్టడమేంటని ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు. జగన్ ప్రభుత్వం తాకట్టు పెట్టింది భవనాలను కాదని, ఆంధ్రుల ఆత్మగౌరవాన్నని తీవ్రంగా విమర్శించారు. సమున్నతమైన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ను జగన్ నాశనం చేశారని ఆరోపించారు. ఈ అసమర్థ, అహంకార పాలనలో కోల్పోతున్న వాటిపై ఆంధ్రులు ఆలోచన చేయాలని చంద్రబాబు కోరారు. కాగా, లోక్ సభ మాజీ స్పీకర్ బాలయోగి వర్ధంతి సందర్భంగా చంద్రబాబు ఆయనకు నివాళులు అర్పించారు. బడుగు, బలహీన వర్గాలకు బాలయోగి చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఓ సాధారణ కుటుంబంలో పుట్టి లోక్ సభ స్పీకర్ దాకా ఎదిగిన బాలయోగి ఆదర్శనీయుడని కొనియాడారు.

జగన్‌ అధికారంలోకి రాగానే అమరావతిని అటకెక్కించిన సంగతి తెలిసిందే. చివరికి... 90 శాతం పూర్తయిన అఖిలభారత సర్వీసు అధికారులు, ఉద్యోగుల భవన సముదాయాలను కూడా గాలికి వదిలేశారు. కానీ... ఇటీవల ఆ భవనాల్లో అధికారాలు నివసిస్తున్నారని, సీఆర్డీయేకు రూ.70 కోట్లు అద్దె కూడా చెల్లించామంటూ జీవో విడుదల చేశారు. నిర్మాణం పూర్తికాని భవనాల్లో నివాసం ఉండటమేంటి... దానికి అద్దె చెల్లించడమేమిటనే అనుమానాలు అప్పట్లోనే తలెత్తాయి. నిర్ణీత గడువులోగా నిర్మాణాలు పూర్తికాకపోతే తీసుకున్న అప్పు మొత్తం తిరిగి చెల్లించాలనే షరతుతో రుణం సేకరించి ఈ ప్రాజెక్టు మొదలుపెట్టారు. మొత్తం అప్పు కట్టలేక, అవి పూర్తయినట్లుగా తప్పుడు జీవోలు సృష్టించారని అప్పుడు భావించారు. కానీ, ఇప్పుడు అసలు విషయం బయటపడింది. ఈ భవనాలను కూడా తాకట్టు పెట్టి అప్పు తెచ్చేందుకే ‘అద్దె’ నాటకం ఆడినట్లు తెలుస్తోంది. సచివాలయ భవనాల తాకట్టు అనంతరమే... అధికారుల భవన సముదాయాలనూ తాకట్టు పెట్టి అప్పు తెచ్చే ప్రక్రియ మొదలైనట్లు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story