Chandrababu: రాజధాని భూములు అమ్మే హక్కు జగన్‌కు ఎక్కడుంది?- చంద్రబాబు

Chandrababu: రాజధాని అమరావతి నిర్మాణానికి ఒక్క ఇటుక పెట్టని జగన్‌కు.. రాజధాని భూములు అమ్మే హక్కు ఎక్కడుందని ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు. స్ట్రాటజీ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన వైసీపీ పాలనపై విరుచుకుపడ్డారు. అమరావతిని శ్మశానం అని చెప్పిన ఈ ప్రభుత్వం.. ఇప్పుడు ఎకరా 10 కోట్లకు ఎలా అమ్మకానికి పెడుతుందన్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మించిన భవనాలను మూడేళ్లుగా పూర్తి చేయకుండా ఇప్పుడు ప్రైవేటు సంస్థలకు అద్దెకు ఇవ్వాలనుకోవడం అన్యాయమన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పన్ను వాతలు.. పథకాలకు కోతలు పెడుతున్నారని మండిపడ్డారు చంద్రబాబు. ప్రజలకు అందే పథకాలలో రకరకాల నిబంధనల పేరుతో కోతలు పెట్టి.. డబ్బులు మిగుల్చుకుంటున్నారని ఆరోపించారు.
అమ్మ ఒడి పథకంలో 52వేల మంది లబ్ధిదారులు తగ్గారని.. ఒంటరి మహిళకు ఇచ్చే పెన్షన్‌లో నిబంధనలు మార్చారన్నారు. ఒంటరి మహిళ పెన్షన్‌లో ఆంక్షలు అమానవీయమని పేర్కొన్నారు. నిధుల్లేక దుల్హన్ పథకం నిలిపివేశామని హైకోర్టుకు చెప్పడం జగన్ రెడ్డి మోసానికి నిదర్శమన్నారు. ఆత్మకూరులో వైసీపీకి ఓట్లు పెరగలేదన్నారు చంద్రబాబు.
ప్రభుత్వంపై ఉన్న తీవ్ర వ్యతిరేకత ఉప ఎన్నికల ఫలితాల్లో కనిపించిందన్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయించే మద్యం నాణ్యతపై సర్కారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అటు.. ఈ-క్రాప్ నమోదులో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని.. వైసీపీ కార్యకర్తల పేర్లు నమోదు చేసి.. పంట నష్టపోయిన రైతులకు మొండిచేయి చూపారని ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com