CBN: అధికార గర్వంతో దాడులకు దిగొద్దు
తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులు, నేతలకు కీలక సూచనలు చేశారు. అధికారంలోకి వచ్చేశామన్న గర్వంతో ఎవరిపైనా దాడులకు ఎవరూ దిగొద్దని హితబోధ చేశారు. అధికార దర్పంతో దాడులకు దిగొద్దని.. కక్షసాధింపు చర్యలకు పాల్పడవద్దని పార్టీ నేతలు, కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ నేతలతో సమావేశమైన చంద్రబాబు... అధికారంలో ఉన్నామని మనం కూడా దాడులు చేస్తే... వైసీపీకీ, మనకీ తేడా ఉండదని చంద్రబాబు అన్నారు. తప్పు చేసిన వారిని చట్టపరంగా శిక్షిద్దామని పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా టీడీపీ కార్యకర్తలపై నమోదైన అక్రమ కేసుల గురించి చంద్రబాబు ఆరా తీశారు. చట్టపరంగా వారికి కేసుల నుంచి ఎలా విముక్తి కలిగించాలనే దానిపై చర్చించారు.
నియోజకవర్గ ఇన్‌చార్జులు తమ పరిధిలో నమోదైన అక్రమ కేసుల వివరాలను పంపాలని చంద్రబాబు... పార్టీ శ్రేణులను ఆదేశించారు. తెలుగుదేశం నేతల ఇళ్లపై, కార్యాలయాలపై గతంలో వైసీపీ మూకలు దాడులకు దిగినప్పుడు కేసులు పెట్టినా సక్రమంగా వ్యవహరించని దర్యాప్తు అధికారుల వివరాలివ్వాలని, చట్టపరంగానే వారి సంగతి తేలుద్దామని . అధికారంలోకి వచ్చామని నేతలు అలసత్వం ప్రదర్శించొద్దనీ, మంత్రులు కూడా పార్టీ కార్యాలయానికి తరచుగా రావడం సేవగా భావించాలని సూచించారు. ప్రతిరోజూ ఇద్దరు మంత్రులైనా పార్టీ కార్యాలయానికి వచ్చి కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని సూచించారు. మంత్రుల్ని పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చే బాధ్యతను జోనల్ ఇన్‌చార్జులు తీసుకోవాలన్నారు. ప్రజలు, కార్యకర్తల నుంచి వచ్చే వినతుల్ని స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు మంత్రులంతా బాధ్యత తీసుకోవాలని కోరారు.
కార్యకర్తలు, ప్రజల నుంచి విజ్ఞాపన స్వీకరణకు ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించారు. ఇందుకోసం ఓ ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. సమర్థులందరికీ నామినేటెడ్ పదవులు దక్కుతాయని భరోసా ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడిన వారి గురించి ఐదు రకాలుగా సమాచార సేకరణ చేస్తున్నామని, నియోజకవర్గ ఇన్‌చార్జులు, జిల్లా అధ్యక్షులతో పాటు పార్లమెంట్ కోఆర్డినేటర్, నియోజకవర్గ పరిశీలకుడు, ఐవీఆర్‌ఎస్ ద్వారా ఈ సమాచారం తీసుకుంటున్నామని వివరించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com