Chandrababu: నెల్లూరు కోర్టులో దొంగల వ్యవహారంలో ముమ్మాటికీ మంత్రి కాకాని హస్తం ఉంది: చంద్రబాబు

Chandrababu: జగన్ ఒక అపరిచితుడని.. రివర్స్ నిర్ణయాలతో రాష్ట్రం రివర్స్ అయిందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. జగన్ మోసపు రెడ్డి పాలన.. అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో అంధకారం నింపిందన్నారు. పోలవరంలో నాడు జగన్ చేసిన పాపాలే నేడు ప్రాజెక్ట్‌కు శాపం అయ్యాయని అన్నారు. నెల్లూరు కోర్టులో దొంగల వ్యవహారంలో ముమ్మాటికీ మంత్రి కాకాని హస్తం ఉందని ఆరోపించారు.
జగన్ ఏదో చేస్తారని భావించిన సొంత వర్గం కూడా ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో, ఆవేదనతో ఉందన్నారు చంద్రబాబు. ఒక అపరిచితునిలా వ్యవహరిస్తున్న జగన్ తీరుతో రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం జరుగుతుందన్నారు. జగన్ ఎంత బలహీనుడో అతని కేబినెట్ విస్తరణ చూస్తేనే అర్ధమవుతుందన్నారు. వైసీపీలో ఉన్న డొల్లతనం, అసంతృప్తి కేబినెట్ విస్తరణ సందర్భంగా బయటపడిందన్నారు. బ్లాక్ మెయిల్ చేసిన వారికి భయపడి జగన్ పదవులు ఇచ్చినట్లు సొంత పార్టీలోనే ప్రచారం జరుగుతుందన్నారు.
ఉత్తరాంధ్రలో మూడేళ్లు దోచుకున్న సాయిరెడ్డి ఇప్పుడు రాయలసీమకు వెళ్లింది.. అక్కడ దోపిడీ కోసమేనని విమర్శించారు చంద్రబాబు. ఒకటో తేదీనే ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వడానికే వాలంటీర్లను పెట్టానని చెప్పిన జగన్.. ఇప్పుడు మొదటి వారంలో కూడా పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. ఇక.. ఈ నెల 21న టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com