రోడ్డుపై లారీలు నిలిపి చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నాలు

రోడ్డుపై లారీలు నిలిపి చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నాలు
విజయనగరం జిల్లా రామతీర్థానికి చంద్రబాబు రాకుండా ప్రయత్నాలు జరిగాయి.

విజయనగరం జిల్లా రామతీర్థానికి చంద్రబాబు రాకుండా ప్రయత్నాలు జరిగాయి. బాబు కాన్వాయ్‌ వచ్చే దారిలో... లారీలు అడ్డుపెట్టారు. దీంతో టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. చంద్రబాబుకు అడ్డంకులు సృష్టించారనే ఇలా చేశారంటూ మాజీ హోం మంత్రి చినరాజప్ప ఆరోపించారు. పోలీసుల వైఖరికి నిరసనగా టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాన్వాయ్‌ దిగిన చంద్రబాబు.. పోలీసులతో మాట్లాడారు. దీంతో వారు చంద్రబాబు కాన్వాయ్‌ను మాత్రం విజయనగరం వైపు అనుమతించారు. మిగతా టీడీపీ నేతలను అక్కడే అడ్డుకున్నారు. టీడీపీ శ్రేణులకు,పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. టీడీపీ నేతలు, కార్యకర్తలు కిందపడిపోయారు. విజయనగరం ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామి, గజపతినగరం ఎమ్మెల్యే బొత్సా అప్పల నర్సయ్య, ఎమ్మెల్సీ పెనుమత్సను అడ్డుకున్నాయి టీడీపీ, బీజేపీ శ్రేణులు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఏపీ రాజకీయాలు.. విజయనగరం జిల్లా రామతీర్థం రామాలయం చుట్టే తిరుగుతున్నాయి. గత 29న రాముడి విగ్రహంపై దాడి జరగ్గా, 30వ తేదీన కొండ సమీపంలోని కొలనులో రాముడి విగ్రహ శిరస్సు లభ్యమైంది. రాముడి విగ్రహం శిరచ్ఛేదంపై రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగింది. విపక్షాలు పెద్ద ఎత్తున ప్రభుత్వం విమర్శలకు దిగడంతో ఒక్కసారిగా రాజకీయవేడి రాజుకుంది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఘటనాస్థలిని పరిశీలించేందుకు రాగా... ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

చంద్రబాబు కంటే ముందే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ రామతీర్థం చేరుకున్నారు. అన్ని పార్టీల కార్యకర్తలు రామతీర్థానికి క్యూ కట్టారు. దీంతో విజయనగరం జిల్లా పోలీసులు అలర్ట్‌ అయ్యారు. మరో వైపు ఈకేసుకు సంబంధించి రామతీర్థం వార్డు మాజీ సభ్యులు సూరిబాబు, రాంబాబుతో పాటు మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాముడి విగ్రహం ధ్వంసం ఘటనతో సంబంధం లేనివారిని అరెస్టు చేశారని వారి కటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అరెస్టు చేసిన వారిని వదిలిపెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు టీడీపీ నేతలు.

మరోవైపు రామతీర్థంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొండపైకి వెళ్లిన విజయసాయి రెడ్డి కిందకు వస్తుండగా.. రామభక్తులు అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ నినాదాలు చేశారు. విజయసాయి రెడ్డి కారుపై రాళ్లు, చెప్పులు వేశారు. మరోవైపు బీజేపీ శిబిరంలోని కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పార్టీ మహిళా నేత రెడ్డి పావని సొమ్మసిల్లి పడిపోయారు.

Tags

Next Story