Millers Department : మిల్లర్‌పై పౌరసరఫరాల శాఖ కొరడా!

ఓ బాయిల్డ్ రైస్‌మిల్లు యజమాని సర్కారుకు రూ.12 కోట్లు బకాయి పడ్డాడు.. నాలుగేళ్లుగా అదిగో ఇదిగో అంటూ దాటవేస్తున్నాడు. ఇక వడ్డీ రూ.2 కోట్లు కూడా కలుపుకొంటే మొత్తం రూ.14 కోట్లకు చేరింది. పలుమార్లు నోటీసులిచ్చి విసిగిపోయిన పౌర సరఫరాల శాఖ అధికారులు చివరకు అతడి స్థిరాస్తుల జప్తునకు ఉపక్రమించారు. ములుగు జిల్లా కేంద్రంలోని సాయిసహస్ర రైస్‌టెక్ బాయిల్డ్ మిల్లుకు 2019–20 సీజన్‌లో ప్రభుత్వం సేకరించిన రూ.12 కోట్ల విలువైన ధాన్యాన్ని అప్పగించింది.
ఆ ధాన్యాన్ని బియ్యంగా మార్చి తిరిగి ప్రభుత్వానికి సరఫరా చేయాల్సి ఉంది. కానీ, ఏళ్లు గడుస్తున్నా సదరు మిల్లు యజమాని బియ్యాన్ని ఇవ్వలేదు.. ఇటు ఆ మొత్తాన్ని కూడా చెల్లించలేదు. దీంతో పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆదేశాలతో జిల్లా మేనేజర్ బానోతు రాంపతి ఆధ్వర్యంలో అధికారులు శుక్రవారం ఆ మిల్లులో తనిఖీలు జరిపారు.
రూ.4.80 కోట్ల విలువైన ధాన్యం, రూ.కోటి 20 లక్షల విలువైన బియ్యాన్ని సీజ్ చేశారు. రూ.14 కోట్ల బకాయిలో ప్రస్తుతం రూ.6 కోట్ల విలువైన ధాన్యం, బియ్యం జప్తు కాగా.. మిగతా రూ.8 కోట్ల రికవరీకి చర్యలు తీసుకుంటున్నామని రాంపతి తెలిపారు. మిల్లు యాజమన్యానికి సంబంధించిన స్థిరాస్తులను జప్తు చేసేందుకు గాను రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి వివరాలను సేకరిస్తున్నామని వెల్లడించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com