YS Jagan : వరద బాధితుల పరామర్శలో సీఎం జగన్ తీరుపై విమర్శలు

YS Jagan : వెళ్లిందేమో.. వరద బాధితులను పరామర్శించడానికి. జలప్రళయంలో ఆప్తులను పోగొట్టుకున్న వారి కన్నీళ్లు తుడవడానికి. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో నిల్చున్న వారికి అండగా నిలవడానికి. కాని, పరామర్శ పేరుతో ఏపీ సీఎం జగన్ చేస్తున్నదేంటి? నవ్వుకుంటూ సెల్ఫీలు దిగడం పరామర్శ అవుతుందా? ఇవి.. జగన్ పర్యటనపై, దిగుతున్న సెల్ఫీలపై విపక్షం చేస్తున్న విమర్శలు. ఎవరైనా సెల్ఫీ దిగడానికి ప్రయత్నిస్తే.. ఇది సందర్భం కాదు అని సున్నితంగా తిరస్కరించాలి. వెళ్లింది కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న వారిని ఓదార్చడానికి కాబట్టి హావభావాలూ అలాగే ఉండాలి. కాని, జగన్ ఏం చేస్తున్నారు? ఇవి కూడా.. నేతల నుంచి వస్తున్న విమర్శలే.
ముఖ్యంగా కడప జిల్లా పర్యటనకు వెళుతున్న సమయంలో జగన్ దిగిన ఫోటో వైరల్ అవుతోంది. స్వయంగా జగనే సెల్ఫీ తీస్తుండడంతో ఎంపీ మిధున్ రెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎం కార్యదర్శి ధనంజయరెడ్డి కెమెరా వైపు చూస్తూ.. చిరునవ్వులు చిందిస్తున్నారు. దీనిపై నర్సాపురం ఎంపీ రఘురామ సెటైర్లు పేల్చారు. సీఎం జగన్ వరద బాధితుల్ని పరామర్శించేందుకు కొందరితో కలిసి చాపర్‌లో వెళ్లారని.. కానీ వాళ్ల తీరు మాత్రం సరిగా లేదన్నారు. వరద బాధితుల్ని పరామర్శించేందుకు వెళుతూ ఆ నవ్వులేంటని మండిపడ్డారు. సంబరాలు చేసుకునే సమయమా ఇది..ఏమో మరి.. మీరే నిర్ణయించండి అంటూ కామెంట్ చేశారు.
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేష్ కూడా ఘాటుగానే స్పందించారు. జలసమాధి అయిన 60 మంది కుటుంబసభ్యుల్ని పరామర్శించడానికి తప్ప.. వంధిమాగధులతో సెల్ఫీలు తీసుకోవడానికి కాదు అంటూ ఇదే ఫొటోను షేర్ చేశారు. వెళ్లింది.. ప్రభుత్వ నిర్లక్ష్యంతో వచ్చిన విపత్తు వల్ల జరిగిన వేలకోట్ల నష్టం పరిశీలించడానికి.. అంతేతప్ప ప్రజల్ని దూరం పెట్టి నవ్వుతూ ఫోటోలు దిగడానికి కాదు అని కామెంట్ చేశారు. జనం బాధలు అంత పైశాచిక ఆనందం కలిగిస్తున్నాయా జగన్.. అంటూ ట్వీట్ చేశారు నారా లోకేష్.
మందపల్లె, తిరుపతిలోనూ జగన్ సెల్ఫీలు దిగడంపై బాధితులు మండిపడుతున్నారు. విహార యాత్రకు వచ్చారా? వరద బాధిత ప్రాంతాలు చూడడానికి వచ్చారా అని ప్రశ్నిస్తున్నారు. జగన్ తీరు ప్రజల కన్నీళ్లు తుడవడానికి వచ్చినట్టుగా లేదని.. ఏదో ఎంజాయ్ చేయడానికి టూర్ వచ్చినట్టుగా ఉన్నదని విమర్శిస్తున్నారు. సెల్ఫీలు దిగడం తప్పు కాకపోయినా.. సమయం, సందర్భం లేకుండా.. ప్రజల కన్నీళ్లు, వ్యథలు చూడడానికి వెళ్లి సెల్ఫీ దిగడమే పెద్ద వివాదంగా మారుతోంది. అటు, ముఖ్యమంత్రిని జగన్ కలవడానికి ఇన్ని ఆంక్షలేంటనే మాటా కూడా వినిపిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com