Chandrababu : డిజిటల్ ఏపీతో అభివృద్ధి.. సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే - చంద్రబాబు

సంకల్పం ఉంటే ఎలాంటి మంచి పనులైనా చేయవచ్చని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖపట్నంలో జరిగిన 28వ ఈ-గవర్నెన్స్ జాతీయ సదస్సును ప్రారంభించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన డిజిటల్ ఏపీ సంచికను ఆవిష్కరించారు. సరైన సమయంలో సరైన నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీ వచ్చారని, ప్రజలకు మేలు జరిగే నూతన సంస్కరణలు తీసుకువచ్చారని చంద్రబాబు ప్రశంసించారు. సాంకేతికతకు అనుగుణంగా మనం కూడా మారాల్సిన అవసరం ఉందని, ప్రస్తుతం అన్ని ప్రభుత్వ సేవలు ఆన్‌లైన్‌లోనే అందుబాటులోకి వచ్చాయని ఆయన తెలిపారు.
ఐటీ రంగంలో భారతీయులకు అపారమైన నైపుణ్యం ఉందని, ప్రపంచంలో నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు భారత్‌కు చెందినవారని చంద్రబాబు అన్నారు. అందులోనూ ప్రముఖ ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న భారతీయుల్లో దాదాపు 30 శాతం మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే కావడం విశేషమని వ్యాఖ్యానించారు. నాలెడ్జ్ ఎకానమీకి ప్రాధాన్యం ఇవ్వడం వల్లే గతంలో హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, తలసరి ఆదాయంలో తెలంగాణ ప్రముఖంగా మారిందని ఆయన గుర్తు చేశారు.
ప్రముఖ సంస్థల సహకారంతో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఐబీఎం, టీసీఎస్ వంటి సంస్థలు ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వాములవుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం క్వాంటమ్ టెక్నాలజీపై మరింత దృష్టి పెడుతుందని ఆయన తెలిపారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com