Jagan : డిజిటల్ బుక్.. బెడిసికొట్టిన జగన్ ప్లాన్..

టీడీపీ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని కాపీ కొట్టి దానికి కొత్త పేర్లు పెట్టడం జగన్ కు అలవాటే. అలా చేసి చివరకు తన ప్లాన్ తనకే బెడిసికొట్టడం కూడా జగన్ కు కొత్తేం కాదనుకోండి. ఇప్పుడు మరోసారి ఇలాంటిదే జరిగింది. టీడీపీ తీసుకొచ్చిన రెడ్ బుక్ కు పోటీగా జగన్ డిజిటల్ బుక్ ను తీసుకొచ్చారు. ఇందులో తన పార్టీ నేతలు, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న వారిపై ఫిర్యాదులు ఇవ్వాలన్నారు. జగన్ ఉద్దేశంలో కూటమి నేతలను టార్గెట్ చేసుకుని అందులో కంప్లయింట్లు తీసుకోవాలి అనుకున్నారు. కానీ సీన్ మొత్తం రివర్స్ అవుతోంది. చివరకు సొంత పార్టీ నేతలపైనే వైసీపీ కార్యకర్తలు ఫిర్యాదులు చేయడంతో జగన్ కు దిమ్మతిరిగే షాక్ తగులుతోంది.
తాజాగా మడకశిర వైసీసీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామిపై సొంత పార్టీ నేతలే ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. మున్సిపల్ చైర్మన్ గా పదవి ఇప్పిస్తానని చెప్పి తమ దగ్గర రూ.25లక్షలు తీసుకున్నారంటూ పట్టణానికి చెందిన ఐదో కౌన్సిలర్ ప్రియాంక తండ్రి విక్రమ్ డిజిటల్ బుక్ లో ఫిర్యాదు చేశారు. మరో నేత రామరాజు కూడా తిప్పేస్వామిపై ఫిర్యాదు చేశారు. తన చెల్లెలికి ఆగలి మండలం దొక్కల పల్లిలో అగన్వాడీ హెల్పర్ ఉద్యోగం కోసం రూ.75వేలు తీసుకుని ఉద్యోగం ఇవ్వలేదని.. తిరిగి డబ్బులు అడిగినా ఇవ్వట్లేదని ఆరోపించాడు. ఈ ఫిర్యాదులతో జగన్ ప్లాన్ బెడిసికొట్టినట్టు అయింది. సొంత పార్టీ నేతలే కిందిస్థాయి నేతలు, కార్యకర్తలకు ఈ స్థాయిలో అన్యాయం చేశారనే విషయాలు బయటకొస్తున్నాయి.
దీంతో జగన్ ఇరకాటంలో పడ్డారు. తాను చేయాలనుకున్నది ఒకటి అయితే.. ఇక్కడ జరుగుతున్నది ఇంకొకటి. కూటమిని టార్గెట్ చేయాలనుకుంటే.. చివరకు తమ పార్టీ నేతలే టార్గెట్ అయ్యే పరిస్థితి వచ్చింది. మరి ఇలా ఫిర్యాదులు అందుతుంటే జగన్ వారిపై చర్యలు తీసుకుంటారా అనేది ఇక్కడ మరో ప్రశ్న. ఎన్ని తప్పులు చేసినా తన పార్టీ నేతలపై చర్యలు తీసుకోవడం జగన్ హిస్టరీలోనే లేదు. అలాంటప్పుడు ఈ ఫిర్యాదులు ఓ లెక్కా.. అదంతా కూటమి ఆడిస్తున్న నాటకం అనేస్తే సరిపోద్ది కదా అనేది జగన్ కామన్ ప్లాన్. కానీ సొంత పార్టీ నేతలు మీడియా ముందుకు వచ్చి మరీ వైసీపీ నేతలపై చేస్తున్న ఆరోపణలు నిజమే కదా. వాటి గురించి మాత్రం మాట్లాడరు. ఈ డిజిటల్ బుక్ ఎలా ఉందంటే.. ఇప్పటి వరకు బయట పడని వైసీపీ నేతల అవినీతిని మరింత బయట పెడుతోందని కూటమి నేతలు ఎద్దేవా చేస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com