AP : పిన్నెల్లిపై ఈసీ సీరియస్.. కఠిన చర్యలకు ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాచర్లలో మే 13న ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఈవీఎం డ్యామేజ్ పై ఈసీ సీరియస్ అయింది. కెమెరాకు చిక్కిన అధికార వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం మంగళవారం ఆంధ్రప్రదేశ్ డీజీపీని ఆదేశించింది.
మే 13న మాచర్ల నియోజకవర్గంలోని ఏడు పోలింగ్ కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు దెబ్బతిన్నాయి, అందులోనూ పోలింగ్ స్టేషన్ నంబర్ 202లో స్థానిక ఎమ్మెల్యే పీ రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారు. మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ స్టేషన్ నంబర్ 202తో పాటు ఏడు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు పాడైపోయాయని..సిట్టింగ్ ఎమ్మెల్యే పీ రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటన వెబ్ కెమెరాలో రికార్డయ్యిందని ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఎమ్మెల్యే తీరును పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం ఈ పరిణామాన్ని తీవ్రంగా పరిగణించింది.
గొడవలకు కారణమైన వ్యక్తులందరిపై కూడా కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు కోరడంతో పాటు.. వివరాలు ఆయనకు తెలియజేయాలని సీఈవోను ఆదేశించారు. పల్నాడు జిల్లా ఎన్నికల అధికారులు ఈ ఘటనలకు సంబంధించిన ఫుటేజీని పోలీసులకు అందించి విచారణలో సహకరించారు. విచారణలో ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి పేరును నిందితుడిగా చేర్చినట్లు తెలుస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com