Editorial: "కడప గడపలో విరిగిపోతున్న ఫ్యాన్ రెక్కలు "

Editorial: కడప గడపలో విరిగిపోతున్న ఫ్యాన్ రెక్కలు
కడప గడపలో రసవత్తర రాజకీయం; అధికారపార్టీపై తగ్గుతున్న ఆదరణ; వైసీపీ నేతల్లో అంజద్ భాషా అలజడులు; దందాలు, కబ్జాలతో నేతల మధ్య కలహాలు; ప్రతిపక్ష టీడీపీకి అనుకూలంగా పరిణామాలు; సైకిల్ పార్టీ టిక్కెట్ కు ఎక్కడాలేని డిమాండు

రాష్ట్రంలోని రాజకీయ వివాదాలకు రచ్చబండ లాంటి కడప జిల్లాలో టీడీపీలో కొనసాగుతున్న టిక్కెట్ల రేస్ ఫార్ములా ఈ రేస్ ను సైతం పక్కకు నెట్టేలా కనిపిస్తోంది. ముంచుకొస్తున్న సార్వత్రిక సమరానికి సన్నద్ధం కావడానికి టీడీపీ టికెట్ కోసం ఆశావహులు అర్రులు చాస్తున్నారట. జగన్కు రాజకీయ జన్మస్థలంలాంటి కడప జిల్లాలో వైసీపీకి క్రమేపీ ఆదరణ తగ్గుతుందోట. పాలకుల దోపిడీ, ప్రజా కంటక నిర్ణయాలు, అలవి కానీ హామీలు, అడ్డంగా నడ్డి విరుస్తున్న పన్నులు... ఇలా విసిగి వేసారిన జనం కడప గడపలో జగన్ పార్టీ నాయకులపై ప్రతినిత్యం జగడాలకు దిగుతున్నారట. కడప అసెంబ్లీ నియోజకవర్గం ఇందుకు ప్రధాన వేదికైంది.

దశాబ్ద కాలంగా కడప ఎమ్మెల్యేగా కొనసాగుతున్న అంజద్ భాషా.. సామాజిక సమీకరణాల నేపథ్యంలో మైనారిటీ కోటా కింద జగన్ కేబినెట్లో బెర్త్ సంపాధించారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలోనూ ఈ అమాత్యుని పదవి పదిలంగా ఉండడానికి సామాజిక సమీకరణే కారణమట. ఇలా పది సంవత్సరాల శాసనసభ్యుడిగా పదవీకాలంతో పాటుగా.. అదనంగా దక్కిన అమాత్యపదవి ఈ మంత్రి అడ్డగోలు సంపాదనకు ఆలవాళంగా తయారైందని ఒకటే చర్చలు నడుస్తున్నాయి. కడపలో కబ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు, సివిల్ పంచాయితీలు, మాట వినకుంటే దాడులు. ఇలా ఈ అమాత్యుని కుటుంబం కడప నియోజకవర్గంలో గడప గడపలో వైసీపీని పతనం చేసిందని ఒకటే చర్చ నడుస్తోంది.

సాధారణంగా వైఎస్ కుటుంబీకులు, బంధువర్గం కనుసన్నల్లో నడిచిన కడప రాజకీయం... అంజద్ భాయ్ హస్తగతం చేసుకున్నాడన్నది ఇక్కడ కఠోర వాస్తవం. కడపలో కమలాపురం నియోజకవర్గం కూడా అంతర్భాగమైన పరిస్థితి. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, జగన్ కు చిన్నాన్న వరసైన ఆర్టీసీ ఛైర్మన్ మల్లికార్జున్ రెడ్డి వర్గం కూడా కడప వైసీపీలో కీలకం. వీరిద్దరిని తోసిరాజని డిప్యూటీ సీఎం హోదాలో ప్రతిరోజు ప్రోటోకాల్ షెడ్యూల్ తో అంజాద్ భాష చుక్కలు చూపిస్తున్నారట. నగర శివార్లలోని రియల్ వెంచర్లు, వివాదాస్పద భూములతో వ్యాపారాల కోసం వీరి మధ్య కీచులాట మొదలైందట. ఈ నేపథ్యమే కడప నియోజకవర్గం వైసీపీలో కలహాలకు కారణమైందట.

కొద్ది నెలల కిందట జరిగిన కార్పొరేషన్ పాలకవర్గ సమావేశంలో మంత్రి అంజద్ భాషా వర్గం కౌన్సిలర్లు, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి వర్గం కౌన్సిలర్లు బాహబాహికి కూడా దిగారు. ఇలా ఇంటిపోరుతో సతమతమవుతున్న వైసీపీ కలహాల మయంగా మారిందట. ఈ నేపథ్యమే కడప గడపలో సంకుల సమీకరణాలకు దారితీస్తోందట. ముస్లిం మైనార్టీ వర్గాలకి చెందిన ఖలీల్ భాషా పది సంవత్సరాలు, అహమదుల్లా పది సంవత్సరాలు, నేటిమంత్రి అంజద్ భాష పది సంవత్సరాలు.. ఇలా మొత్తం మూడు దశాబ్దాలుగా కడప నియోజకవర్గంలో మైనారిటీలు శాసన సభ్యులుగా కొనసాగుతున్నారు. ఇలా వీరి ఏలుబడిలో మిగతా వర్గాలకు ప్రాధాన్యత దక్కలేదన్న ప్రచారం కడప నియోజకవర్గంలో జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యమే సరికొత్త రాజకీయ సర్దుబాటుకు కారణభూతమౌతోందట.

సామాజిక సర్దుబాట్ల నేపథ్యంలో ప్రధాన పార్టీలు సరికొత్త ఫార్ములా కై సర్వేలు మొదలెట్టినట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి ఇప్పటికే రెండుసార్లు ఓడిపోయిన ఆమీర్ బాబు అంతగా రాణించలేకపోయాడనే టాక్ సర్వత్రా వినపడుతోంది. ముఖ్యంగా ఈ అసెంబ్లీ స్థానానికి ఈసారి టీడీపీ నుండి ఆశావహుల జాబితా మరీ ఎక్కువైంది. లోకేష్ సర్వమత క్షేత్రాల పర్యటనలో భాగంగా ఆశావహులు పెద్దమొత్తంలో సందడి చేశారు. ఇందులో కడప నగరానికి చెందిన ప్రఖ్యాత వైద్యుడు కృష్ణ కిషోర్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. స్వతహాగా వైద్యుడైన ఈయన స్థానిక రాజకీయ సమీకరణలకు సరిపోతాడన్న ప్రచారం జరుగుతోంది. లోకేష్ పర్యటనలో తన అనుచరులతో ఈయన పెద్దఎత్తున హడావుడి చేశాడు. స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలతో రాజకీయ అరంగేట్రానికి రంగంసిద్ధం చేస్తున్నట్లుగా సంకేతాలు ఇచ్చాడీ వైద్యుడు.

ఇకపోతే రెండో ఆశావహుడు... జిల్లా రాజకీయాల్లో పరిచయం అక్కరలేని పేరైన రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి. కడప పార్లమెంట్ అభ్యర్థిగా ఈయన పేరు ప్రచారంలో ఉంది. సతీమణి మాధవిని కడప అసెంబ్లీ బరిలో దించే యోచనలో అంతర్గతంగా శ్రమిస్తున్నారని టాక్. ఇకపోతే ముచ్చటగా మూడో వ్యక్తి ఉమాదేవి. ఈమె అలంకార్ పల్లి లక్ష్మిరెడ్డి కుటుంబం కోడలు. కడప శివారు ప్రాంతమైన అలంకార్ పల్లిలో ఈ కుటుంబానకి మంచి పట్టుంది. గతంలో నాలుగు కార్పొరేటర్లను కైవసం చేసుకున్న లక్ష్మిరెడ్డి కుటుంబం ఉమాదేవిని బరిలో దింపేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోందట. ఇలా కడప బరిలో టీడీపీ వైపు నుంచి సింగిల్ సీటు కోసం ముగ్గిరి పోటీ రసవత్తర రాజకీయాన్ని రక్తి కట్టిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story