AP: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి హోరు

AP: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి హోరు
ప్రచారంలో దూసుకుపోతున్న అభ్యర్థులు... . ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థన

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అభ్యర్థుల ప్రచార జోరు కొనసాగుతోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. కూటమి అభ్యర్థులు తెలుగుదేశం సూపర్‌ సిక్స్‌ పథకాలు వివరిస్తూ మహిళలను ఆకర్షిస్తున్నారు. జిల్లా మైదుకూరులో కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్‌ ఇంటింటి ప్రచారం చేశారు. సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అన్నమయ్య జిల్లా రాయచోటి కూటమి అభ్యర్థి మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి లక్కిరెడ్డిపల్లెలో పర్యటించారు. రోడ్‌షో నిర్వహించి బహిరంగ సభలో పాల్గొన్నారు. మరోవైపు అనంతపురంలో ఇండియా కూటమి అభ్యర్థి జాఫర్ ఇంటింటి ప్రచారం చేశారు. కరపత్రాలు పంచుతూ తమకే ఓటు వేయాలని కోరారు. సీఎం జగన్‌ సానుభూతితో రాజకీయాలు చేయాలని చూస్తున్నారని జాఫర్‌ విమర్శించారు. అవినీతి, అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా రాయదుర్గం కూటమి అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు... రాయదుర్గం మండలంలో ప్రచారం చేశారు. సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఆర్.బి. వంక గ్రామంలో దాదాపు 50 కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి.


పల్నాడు జిల్లా చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు నియోజకవర్గంలో ప్రచారం ఉద్ధృతం చేశారు. గడప గడపకూ తిరుగుతూ తెలుగుదేశం సూపర్‌ సిక్స్‌ పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఐదేళ్ల వైసీపీ పాలనను ఎండగట్టారు. వివిధ వర్గాల ప్రజలు, సంఘాలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. బాపట్ల కూటమి అభ్యర్థి వేగేశన నరేంద్ర వర్మ పెద గొల్లపాలెం పంచాయతీ పరిధిలోని గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రోడ్‌షోకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థుల నుంచి విశేష స్పందన వచ్చింది. కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

N.T.R. జిల్లా నందిగామలో 30 కుటుంబాలు వైకాపాను వీడి తెలుగుదేశంలో చేరాయి. కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అరాచకాలను తట్టుకోలేకనే వైసీపీ కార్యకర్తలు, నాయకులు పార్టీని వీడుతున్నారని సౌమ్య అన్నారు. సొంత పార్టీ నుంచి వారే వచ్చే ఎన్నికల్లో జగన్‌కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైకాపాకు భారీ షాక్ తగిలింది. మాజీ M.L.A. సుభానితో సహా 500మంది... లోకేష్ సమక్షంలో తెలుగుదేశంలో చేరారు.

Tags

Read MoreRead Less
Next Story