AP: వైసీపీకి వంతపాడిన పోలీసులపై చర్యలు

AP: వైసీపీకి వంతపాడిన పోలీసులపై చర్యలు
అనంతపురం స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ జాకీర్‌ హుస్సేన్‌పై వేటు... ఏఆర్‌ అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణరెడ్డిపై వేటు

అనంతపురంలో వైసీపీ నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ... వారు చేస్తున్న అరాచకాలకు వంతపాడుతున్న పోలీసులపై వేటు పడింది. ఏఆర్ అదనపు ఎస్పీతో పాటు స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. తాడిపత్రి అల్లర్లవేళ... అప్పటి ఎస్పీ అమిత్ బర్దర్‌కు సహకరించని... ఏఆర్ అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణరెడ్డితో పాటు.... విధుల్లో బాధ్యతారహితంగా వ్యవహరించిన స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ జాకీర్ హుస్సెన్‌లను...D.G.P. కార్యాలయానికి సరెండర్‌ చేశారు.ఇద్దరు అధికారులు ఆదివారం DGP కార్యాలయంలో రిపోర్ట్‌ చేసినట్లు తెలిసింది.

పది సంవత్సరాలుగా అనంతపురంలోనే ఉంటూ... అధికారపార్టీ నాయకులతో కలిసిపోయి... వారు చెప్పిందల్లా చేస్తూ... సొంత పోలీసులనే తప్పుదోవ పట్టించిన సీఐ జాకీర్‌ హుస్సేన్‌పై... ఎస్పీ గౌతమి సాలి వేటు వేశారు. D.G.P. కార్యాలయానికి సరెండర్‌ చేశారు. ఎన్నికల విధుల్లో జాకీర్‌ హుస్సేన్‌ బాధ్యతారహితాన్ని D.I.G., D.G.P. కార్యాలయానికి పూసగుచ్చినట్లు నివేదించిన ఎస్పీ... అతను జిల్లాలో పనిచేయడానికి అర్హుడు కాదని చెప్పినట్లు సమాచారం. పోలింగ్‌ రోజున తాడిపత్రిలో జరిగిన రాళ్లదాడిని తొక్కిపట్టేలా వ్యవహరించిన తీరు తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనపై అనంతపురం ఎస్పీ అమిత్‌ బర్దార్‌పై ఈసీ చర్యలు తీసుకుంది. జాకీర్ హుస్సేన్ గతంలో పనిచేసిన పోలీస్ స్టేషన్లలో వైసీపీ ప్రజాప్రతినిధికి అనుకూలంగా వ్యవహరించిన తీరుపై ఎస్పీ రహస్య విచారణ జరిపించారు. తర్వాత D.G.P. కార్యాలయానికి సరెండర్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. శనివారం అర్ధరాత్రి విజయవాడకు వెళ్లిన స్పెషల్ బ్రాంచి సీఐ జాకీర్ హుస్సేన్...డీజీపీ కార్యాయంలో రిపోర్టు చేసినట్లు సమాచారం.

జిల్లా ఎస్పీకి కళ్లు, చెవుల్లా పనిచేయాల్సిన స్పెషల్ బ్రాంచ్ విభాగం.... బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ... అధికార పార్టీకి అనుకూలంగా పనిచేసిన వైనాన్ని... ఎస్పీ గౌతమీ సాలి లోతుగా పరిశీలించారు. ఇదే క్రమంలో గతంలో అనంతపురంలో పనిచేసిన పోలీస్ స్టేషన్లలో సీఐ జాకీర్ హుస్సేన్... కొంతమంది వ్యక్తులపై అక్రమ కేసులు పెట్టిన వివరాలు తెప్పించుకున్నారు. ఓ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో పనిచేస్తూ అక్రమ కేసులు పెట్టటంపై... కర్ణాటకకు చెందిన ఆర్యవైశ్యులైన వృద్ధులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తాడిపత్రి అల్లర్ల వేళ అదనపు బలగాలు కావాలని అప్పటి ఎస్పీ కోరినా... తగినన్ని లేవంటూ బాధ్యతారహితంగా వ్యవహరించిన... ఏఆర్‌ అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణరెడ్డిపై నా వేటు పడింది. అదనపు బలగాలు పంపనందుకే అల్లర్లు పెరిగినట్లు అప్పటి ఎస్పీ అమిత్‌ బర్దర్‌ నివేదించారు. అమిత్‌ బర్దర్‌పై వేటు వేసిన తర్వాత.. ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన గౌతమి సాలి తాడిపత్రి వైఫల్యాలను లోతుగా పరిశీలిస్తున్నారు. ఏఆర్‌ అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణరెడ్డిని పిలిచి వివరాలు కోరగా... పొంతనలేని జవాబులు చెప్పినట్లు సమాచారం. లక్ష్మీనారాయణరెడ్డి తీరుపై ఎస్పీ గౌతమి సాలి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు D.I.G. చర్యలు తీసుకున్నారు.

Tags

Next Story