Voting : మూడ్రోజుల్లో ఖేల్ ఖతం.. ఓట్లకోసం అసలైన సమయం ఆసన్నం

ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక సమరం తుది దశకు చేరుకుంది. ప్రచారానికి ఇంకా మిగిలింది కేవలం 3 రోజులే కావడంతో అభ్యర్ధులు 'సమయం లేదు మిత్రమా' అంటూ శ్రేణులను ఓటర్ల చెంతకు పరుగులు పెట్టిస్తున్నారు. తమవంతు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఆఖరి ఓటును కూడా తమకే వేయాలని అభ్యర్థిస్తున్నారు.
ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్ల వివరాలను ఇప్పటికే సేకరించిన నాయకులు వారిని రప్పించి ఓటు బలాన్ని పెంచుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే గ్రామానికి ఇద్దరు చొప్పున బాధ్యులను నియమించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పడిన ఓట్ల ఆధారంగా, ఆయా ప్రాంతాలపై ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఓటర్లు ఎక్కడుంటే అక్కడికే వెళ్లి ఒక్కో ఓటరుకు ప్రత్యేకంగా సమయమిచ్చి తమవైపు తిప్పుకునే విధంగా చేయాలని గ్రామస్థాయి నేతలను ఆదేశిస్తున్నారు.
ముస్లిం, మైనార్టీ ఓటర్లను తమవైపు మళ్లించుకునేందుకు నాయకులు ప్రతి రోజు వారి నివాస ప్రాంతాలకు వెళ్లి ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. అవసరమైన సదుపాయాలు కల్పిస్తాం.. మీ ఓట్లు మా పార్టీకే వేయాలి.. వేయించాలి అని మాట తీసుకుంటున్నారు. పోలింగ్ కు 3 రోజుల ముందు ఎన్ని కోట్లు లేస్తాయో అన్నది విశ్లేషకుల అంచనా.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com