BOTSA: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైసీపీ నుంచి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ బరిలో దిగనున్నారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. బొత్సను అభ్యర్థిగా ప్రకటించారు. ఆగస్ట్ 30నఈ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 841 ఓట్లున్నాయి. ఇందులో వైసీపీకి 615, టీడీపీకి 215 ఓట్లు, 11 ఖాళీలున్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన నామినేషన్లను ఆగస్ట్ 13 వరకూ స్వీకరించనున్నారు. వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న వంశీ కృష్ణ యాదవ్ ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి జనసేన ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందడంతో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్సను అభ్యర్థిగా జగన్ ప్రకటించడంతో ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. తాడేపల్లిలోని తన కార్యాలయంలో ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో వైసీపీ అధినేత జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మెజారిటీ సభ్యులు బొత్సను అభ్యర్థిగా నిలబెడితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేయడంతో వైసీపీ అధినేత జగన్ బొత్సను అభ్యర్థిగా ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు వంశీ కృష్ణ వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో జాయిన అయి వంశీపై అనర్హత వేటు పడింది. దీంతో అక్కడ ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి.. ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో సీటు గెలవడం ఇరు పక్షాలకు అనివార్యంగా మారింది.
విశాఖ స్థానిక సంస్థల ఓటర్లలో వైసీపీకి భారీ ఆధిక్యం ఉంది. మొత్తం 841 ఓటర్లు ఉంటే అందులో వైసీపీకి చెందిన వాళ్లే 615 మంది ఉన్నారు. టీడీపీకి కేవలం 215 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అప్పట్లో అంటే 2020లో జరిగిన ఎన్నికలను టీడీపీ బహిష్కరించింది. అయినా చాలా ప్రాంతాల్లో ఆ పార్టీ అభిమానులు, నేతలు పోటీ చేసి విజయం సాధించారు. ఇక్కడ లెక్కలు గమనిస్తే వైసీపీ గెలవడం అంత కష్టమేమీ కాదు. కానీ ఆ పార్టీ ప్రతిపక్షం ఉండటంతో గెలుపు అంత ఈజీ కాదన్నది మరో వైదన ఉంది.
మారిన రాజకీయ పరిస్థితులతో చాలా మార్పులు జరిగాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన వైసీపీకి ఇప్పటికే విశాఖ కార్పొరేటర్లు రాజీనామా చేశారు. వాళ్లంతా టీడీపీ, జనసేన పార్టీల్లో చేరిపోయారు. ఎంపీటీసీలు, సర్పంచ్లు, జడ్పీటీసీలు టీడీపీ గూటికి చేరారు. ఇంకా ఎన్నికలు చాలా సమయం ఉన్నందున మరికొందరు అదే బాట పడతారని వైసీపీ ఆలోచిస్తోంది. ఇంకొందరు ఆయా పార్టీల్లో చేరకోపయినా ఓటు తమకే వేస్తారనే గ్యారంటీ లేదని భావిస్తోంది. అందుకే ముందుగా క్యాంపు రాజకీయాలు స్టార్ట్ చేసింది. వీటికి తోడు అందర్నీ కలుపుకొని వెళ్లి బలంగా ఉన్న నాయకుడిని అభ్యర్థిగా నిలబెడితే సగం విజయం సాధించినట్టేనని భావించింది. ప్రస్తుతానికి ఉత్తరాంధ్రలో వైసీపీకి ఉన్న అతి పెద్ద లీడర్ అయిన బొత్స సత్యనారాయణను రంగంలోకి దించింది. ఆయన అయితే స్థానిక పరిచయాలు, నేతలతో ఉన్న సంబంధాలు ఇక్కడ కీలకంగా మారతాయని ప్లాన్ చేసింది. అందరితో ఆలోచించి బొత్స పేరును ఇవాళ జగన్ ఖరారు చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com