AP: వీడుతున్న అమరావతికి పట్టిన గ్రహణం

AP: వీడుతున్న అమరావతికి పట్టిన గ్రహణం
X
చంద్రబాబు ప్రమాణ స్వీకారం వేళ అమరావతిలో పండుగ వాతావరణం...

నవ్యాంధ్ర నిర్మాత చంద్రబాబు ప్రమాణ స్వీకారం కోసం అమరావతి వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. ఐదేళ్లుగా రక్కసి చేతుల్లో పడి నలిగిపోయిన ప్రజారాజధాని కూటమి గెలుపుతో ఇప్పటికే ఊపిరి పోసుకుంది. అధికార యంత్రాంగం జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు చేపట్టడంతో... పట్టిన గ్రహణం వీడి కొత్త కళ సంతరించుకుంది. ఎటు చూసినా మిరుమిట్లు గొలిపే విద్యుత్‌ దీపాలు, అభివృద్ధి పనులతో పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి అని రాష్ట్ర ప్రజలు సగర్వంగా తలెత్తుకుని చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయని రాజధాని రైతులు చెబుతున్నారు.


ఆంధ్రుల కలల ప్రజా రాజధాని అమరావతికి మంచి రోజులు వచ్చాయి. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని నగరంగా 2015లో అమరావతి పురుడు పోసుకుంది. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ప్రపంచ స్థాయి నగరంగా అమరావతికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రూపకల్పన చేశారు. పరిపాలనా నగరంతో పాటు ఆర్థిక, న్యాయ, వైద్య, క్రీడ, సాంస్కృతిక, ఎలక్ట్రానిక్స్‌, పర్యాటక, విద్యా, వైజ్ఞానికం అంటూ నవ నగరాల నిర్మాణాలకు చోటు కల్పించారు. 217 చదరపు కిలోమీటర్లలో తొలి దశలో 58 వేల కోట్ల రూపాయల అంచనాలతో రాజధాని నిర్మాణ పనులు చేపట్టారు. వైకాపా నాయకులు కేసులు పెట్టినా వాటిని అధిగమించి పనులు శరవేగంగా ముందుకు తీసుకెళ్లారు.

కేవలం 6 నెలల్లోనే 6 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రదేశంలో... సచివాలయం, అసెంబ్లీ భవనాలు అందుబాటులోకి తెచ్చి... అక్కడి నుంచే పరిపాలన ప్రారంభించారు. మరోవైపు అనతికాలంలోనే నిధులు సమకూర్చుకుంటూ.... అమరావతి ఒక బ్రాండ్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. అయితే 2019లో వైకాపా ప్రభుత్వం రాగానే అప్పటి వరకు పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరులా మారింది. మూడు రాజధానుల నిర్ణయంతో అమరావతిలోని పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. అమరావతినే రాజధానిగా ఉంచాలంటూ రైతులు ఐదేళ్లుగా పట్టు వదలని విక్రమార్కుల్లా పోరాడుతూ వచ్చారు. ఈ ఎన్నికల్లో కూటమి గెలుపుతో రాజధాని రైతుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి.

Tags

Next Story