KV Ratnam : కేవీ రత్నం అంత్యక్రియలు నేడు.. విద్యావేత్తల నివాళులు

ప్రముఖ విద్యావేత్త, రత్నం విద్యాసంస్థల అధినేత కొర్రపాటి వెంకటరత్నం కన్నుమూశారు. ఆయన వయస్సు 82 ఏళ్లు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. ఏపీలోనే తొలిసారిగా కోచింగ్ సెంటర్లను నెల్లూరులో ఏర్పాటు చేసిన ఘనత ఆయనది.
పేద విద్యార్థులకు తమ సంస్థల్లో ఉచితంగా కోర్సులు అందించారు కేవీ రత్నం. గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు సొంత డబ్బుతో ఆపరేషన్లు చేయించారు. వెంకటరత్నం శిష్యులు ఎందరో నేడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత హోదాల్లో ఉన్నారు. గురువారం వెంకటరత్నం అంత్యక్రియలు జరగనున్నాయి.
1943 మే 23న నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం చలపనాయుడుపల్లిలో వెంకటరత్నం జన్మించారు. ఆత్మకూరు ప్రాంతంలోనే పదో తరగతి పూర్తిచేశారు. 1961-62లో పీయూసీ, 1963-66లో నెల్లూరు వీఆర్ కళాశాలలో బీఎస్సీ కెమిస్ర్టీలో డిస్టింక్షన్ సాధించారు. 1966లో అదే కాలేజీ కెమిస్ట్రీ విభాగంలో నెలకు రూ.240 జీతంతో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత నెల్లూరులోని రజిక వీధిలో జయంతి ట్యుటోరియల్స్‌ను ప్రారంభించారు. 1983లో రాష్ట్రంలోనే తొలిసారిగా రత్నం కోచింగ్ సెంటర్ ప్రారంభించి, 1985లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. అక్కడినుంచి అంచెలంచెలుగా ఎదిగిన రత్నం విద్యాసంస్థలు రాష్ట్రంలోనే సంచలనాత్మక విద్యావేదికగా గుర్తింపు పొందాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com