AMARAVATHI: అమరావతి ఉద్యమానికి నాలుగేళ్లు
అమరావతి పరిరక్షణ ఉద్యమానికి నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా రాజధానిలో రైతులు, మహిళలు నిరసన కార్యక్రమాలు హోరెత్తించారు. జగన్ నయవంచనకు నాలుగేళ్లంటూ దీక్షా శిబిరాల్లో నినదించారు. అవిశ్రాంతంగా పోరాడిన తమ త్యాగం ఊరికే పోదన్న మహిళలు...ఇంకో 3 నెలల్లో జగన్ ఇంటికి పోవడం ఖాయమని తేల్చిచెప్పారు. మూడు రాజధానుల ప్రకటనతో ఉద్యమబాట పట్టిన అమరావతి రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు తమ సంకల్పాన్ని ఘనంగా చాటారు. అమరావతి పరిరక్షణ ఉద్యమానికి నాలుగేళ్లు పూర్తై...1461వ రోజుకు చేరిన సందర్భంగా ..తుళ్లూరులో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత జెండా వందనం చేసి...అమరావతికి అభివందనం చేశారు. తర్వాత హిందూ ,ముస్లిం, క్రిస్టియన్ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆమరావతికి ఆశీస్సులు అందించారు. అమరావతి చిరకాల రాజధానిగా నిలుస్తుందని దీవించారు. ఉద్యమ అమరవీరులకు రైతులు నివాళులు అర్పించారు.
అనంతరం ప్రభుత్వం తీరును నిరసిస్తూ వినూత్న నిరసన చేపట్టారు. దున్నపోతు ముందు బూరలు ఊదుతూ వినతిపత్రం సమర్పించారు. నాలుగేళ్లుగా అమరావతి ఉద్యమం సాగుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. తమపై అక్రమ కేసులు పెట్టిన జగన్...ఇక ఇంటికి పోక తప్పదని హెచ్చరించారు. అమరావతి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని రైతులు తేల్చి చెప్పారు. తమను వంచించిన జగన్ మూల్యం చెల్లించుకోక తప్పదని మహిళలు తేల్చి చెప్పారు. నాలుగేళ్ల ఉద్యమం సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు సభకు హాజరై అమరావతి రైతులు, మహిళలకు సంఘీభావాన్ని తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో కలిసి కట్టుగా పోరాడి జగన్‌ను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు.
మూడు రాజధానుల పేరిట వైసీపీ సర్కార్ తెరలేపిన నాటకానికి నాలుగేళ్లు పూర్తయ్యాయి. ప్రభుత్వ దమన నీతిపై భగ్గుమన్న రాజధాని ప్రాంత రైతులు ఆ మరుసటి రోజే ఉద్యమబావుటా ఎగురవేశారు. నాటి నుంచి నేటి వరకు అమరావతి అంతమే లక్ష్యంగా ప్రభుత్వం రాజధానిపై విషం కక్కుతోంది. సర్కార్ అణచివేతలు, నిర్బంధాలు, కిరాతకాలను... అన్నదాతలు పోరాట స్ఫూర్తితో అధిగమించారు. అక్రమ కేసులు, అరెస్టులను తట్టుకుని ఒక్కరోజూ విరామం లేకుంటా ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. 2019 డిసెంబరు 17న శాసనసభ సాక్షిగా అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన చేయటంతో పాటు దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఉన్నప్పుడు రాష్ట్రానికి ఉంటే తప్పేంటన్న వితండవాదాన్ని తెరపైకి తెచ్చారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో రాజధాని అమరావతికి మద్దతిచ్చి, ఇక్కడే ఇల్లు కూడా కట్టుకుంటున్నా రాజధానిని ఎక్కడికీ మార్చబోమని ఎన్నికల ముందు ప్రజలను నమ్మించారు. అధికారం చేపట్టిన అనతికాలంలోనే మాట తప్పి... మడమతిప్పి తన నిజస్వరూపాన్ని బయటపెట్టారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com